Thursday, September 19, 2024

Journalists : జర్నలిస్టుల నివేశన స్థలాల విషయంలో.. మంత్రి పొన్నం హామి ఏమేరకు నిలబడేనూ?

  • ఫిర్యాదుల పేచి..ఆందోళనలో జర్నలిస్టులు!
  • ఎన్నికల కోడ్‌ రాకముందు తేల్చేనా..?

కరీంనగర్‌,జనతా న్యూస్‌: గత ప్రభుత్వంలో కరీంనగర్‌ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల పట్టాల పేచీ రోజుకో మలుపు తిరుగుతోంది. అర్హులు, అనర్హుల పేరుతో పరస్పర ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఇచ్చిన పట్టాలపై..ఈ పార్లమెంటు ఎన్నికల కోడ్‌ రాకముందు స్పష్టత వస్తుందా, రాదా..అనే ఆందోళనలో జర్నలిస్టులున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ జర్నలిస్టుల నివేశన స్థలాలకు సంబంధించి తనకు పూర్తి సమాచారం ఉందని, గత ప్రభుత్వం ఇష్ఠారాజ్యంగా వ్యవహరించి అనర్హులకు పట్టాలిచ్చారని వాటిని రద్దు చేస్తామని ప్రెస్‌ క్లబ్‌ సాక్షిగా హామి ఇచ్చారు.కాని మరుసటి రోజునుండే ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండటంతో మంత్రి ఇచ్చిన హామిని ఏమేరకు నిలబెట్టుకుంటారోనని ఆయన తీసుకునే నిర్ణయం కోసం జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు.

149 పట్టాల పంపిణీ..

గత ఎన్నికల ముందు కరీంనగర్‌ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు అప్పటి మంత్రి గంగుల కమలాకర్‌. మొదటగా 118 ఆ తర్వాత 31 మొత్తంగా 149 పట్టాలివ్వగా.. రాని వారికి మరో దశలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండో దశ ఇండ్ల స్థలాల పంపిణీపై స్తబ్దత నెలకొంది. దీనిపై అర్హుల్కెన కొందరు జర్నలిస్టులు అటు అధికారుల చుట్టూ..ఇటు ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

అనర్హులకు పట్టాల పంపిణి..

ఎన్నో ఏళ్ళుగా నివేశన స్థలాల కోసం నిరీక్షిస్తున్న జర్నలిస్టులకు యూనియన్ల తరుపున దరఖాస్తులను ఆహ్వనించారు.కనీసం 10 ఏళ్ళుగా కరీంనగర్‌లో పాత్రికేయ వృత్తిలో పని చేస్తుండాలని లాంటి కొన్ని కనీస నిభందనలను పెట్టారు. వచ్చిన దరఖాస్తులను రెండు యూనియన్లకు సంభందించి జాబితాలను కూడ ప్రిపేర్‌ చేశారు.చేసిన వాటిలో ఎన్నో అవకతవకలున్నాయని ఫిర్యాదులందటంతో పలు మార్లు జాబితాను మార్చడం జరిగింది.కాని చివరగా తయారు చేసిన జాబితా కూడ మాయంచేసిన కొంత మంది ఘనులు మంత్రిని తప్పు దోవ పట్టించి అనర్హులకు పట్టాలిప్పించారు.కనీస నిబంధనలను తుంగలో తొక్కి పలుకుబడి ఉన్న వారు చిన్న చేపలను పెద్ద చేపలు తిన్న చందంగా కొందరు రెండు,మూడు పట్టాలనూ పొందారు.ఏది ఏమైన జర్నలిస్టుల పేరు మీద కూడ ఆక్రమాలకు పాల్పడం పై సర్వత్రా విమర్శలు వెలుబడుతున్నాయి .ఏ ప్రాతిపాదికన పట్టాలను అందించారో ఇప్పించిన వారికి, ఇచ్చిన ఆ అధికారులకే తెలియాలి. కొత్తపల్లి మండలం మల్కాపూర్‌, చింతకుంట గ్రామాల పరిధిలో వేరు వేరుగా రెండు చోట్ల కేటాయించిన ఇండ్ల స్థలాల్లో అనర్హులున్నారని ఫిర్యాదులందాయి. హైదరాబాద్‌ ప్రజా  భవన్‌కు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. విచారణ చేపట్టి తేల్చేవరకు ప్లాట్ల వద్దకు ఎవరూ వెల్లవద్దని జర్నలిస్టులకు హుకుం జారీ చేశారు రెవెన్యూ అధికారులు. దీంతో అప్పటికే నిర్మాణం చేపట్టిన కొందరు జర్నలిస్టులు ఆందోళనకు గురైయ్యారు. దీనిపై అధికారుల విచారణ చేపట్టక పోగా..ఆలస్యం చేస్తుండడంతో అర్హుల్కెన జర్నలిస్టుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.

కరీంనగర్‌ ఆర్టీసీ డిపోలో ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను జర్నలిస్టులు కలిశారు. కమిటీ వేసుకుని జాబితా ఇస్తే ప్రభుత్వం నుండి ఇబ్బందులు రాకుండా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఇటీవల పట్టాలు పొందిన వారి నుండి 6గురితో కమిటీ వేసుకున్నట్లు తెలుస్తుంది. వారు ఆర్డీవోను కలసి సమస్యను వివరించినట్లు సమాచారం. పట్టాలు రాని మరొందరు కూడా ఆర్డీవోను కలసి తమ గోడును వెల్లబోసుకున్నారు.ఇదిలా ఉండగా ఒక యూనియన్‌ చెందిన జిల్లా కార్యవర్గం గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని అర్హులైన వారికి అందించాలన్న పొన్నం ప్రభాకర్‌ కు సంపూర్ణ మద్దతు తెలిపి నూతన దరఖాస్తులను ఆహ్వానించింది.కాని ఏం జరిగింతో తెలియదు గాని జిల్లా కార్యవర్గం ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర కార్యవర్గం ప్రకటించడంతో చర్చనీయాంశమైంది. అసలేం జరుగుతుందో , ఏ స్థాయిలో రాజకీయాలు జరుగుతున్నాయో తెలియని అయోమయం జర్నలిస్టుల్లో నెలకొంది.

కాగా..గతంలో ఇచ్చిన 149 మంది జాబితాలో ఎంత మంది జర్నలిస్టులు అర్హులున్నారని కమిటీ భావిస్తోంది. అనర్హులను తొలగించి..అర్హులకు న్యాయం చేయాలని జర్నలిస్టు కమిటీ కోరుతోంది. దీంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు రెండో దశ ఇండ్ల స్థాలాలు కేటాయించాలని సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం నిర్ణయం కోసం జర్నలిస్టులు వేచి చూస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికిప్పుడు తేల్చుతారా..పార్లమెంటు ఎన్నికల తరువాత వరకు వాయిదా వేస్తారా..తనూ ప్రెస్‌ క్లబ్‌ లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా? అనే దానిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు జర్నలిస్టులు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page