జగిత్యాల ఎస్పీ భాస్కర్
Jagityala SP : కోరుట్ల, జనతా న్యూస్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం, డబ్బు సరఫరా కాకుండా జిల్లాలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని బార్డర్లలో 7 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో భాగంగా బుధవారం నూతనంగా గండి హన్మండ్లు, ఓబులాపూర్ చెక్ పోస్ట్లను ఎస్పీ భాస్కర్ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం ఇతర జిల్లాల నుండి రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని తెలిపారు. డబ్బు మద్యం రవాణా జరగకుండా నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. అన్ని బార్డర్లలో చెక్ పోస్ట్ లను ప్రత్యేక గదులతో నిర్మించామని, ఇందులో సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు, శాంతి భద్రతల పరిరక్షణ కు పకడ్బందీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డిఎస్పి రవీంద్రరెడ్డి, సి.ఐ లక్ష్మీనారాయణ ఎస్.ఐలు ఉమాసాగర్, చిరంజీవి, నవీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.