- కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్
- మానకొండూర్ మండలం ముంజంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
కరీంనగర్,జనతన్యూస్: మార్పు తెస్తాం…అందరిని ఉద్దరిస్తాం.. రైతు రాజ్యం తెస్తాం.. అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు వట్టి నీటిమూటలుగా మారిపోతున్నాయని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. మానకొండూర్ మండలం ముంజంపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు క్వింటాలుకు 500 రూపాయలల బోనస్ ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక వచ్చే పంట నుంచి బోనస్ అనడమేంటని ప్రశ్నించారు. బోనస్ పైసలు దేవుడెరుగు కానీ ఉన్న ధాన్యమే కొంటలేరని అన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్ల వేస్తున్నారని అన్నారు. కౌలు రైతులకు 12వేల రూపాయల సాయం చేస్తామని నోరుమెదపడం లేదన్నారు. యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి.రామకృష్ణ రావు, జడ్పీటీసి శేఖర్ గౌడ్, తదితరులు ఉన్నారు.
