పాల్గొన్న కేంద్ర మంత్రి సంజయ్, విప్ ఆది శ్రీనివాస్..
బొమ్మకల్‌లోనూ పెద్దబతుకమ్మ వేడుకలు
వేములవాడ /కరీంనగర్-జనత న్యూస్
తెలంగాణాలో సాధారణంగా తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటుండగా..కొన్ని ప్రాంతాల్లో ఏడు రోజుల్లో పెద్ద బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. బతుకమ్మ తెప్ప వద్ద నిర్వహించిన సంబురాలను ఆయన ప్రారంభించారు. భారీ ఎత్తున వేలాదిగా మహిళలు తరలిరావడంతో సమూహాలుగా ఏర్పడి బతుకమ్మ, కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రతి ఒక్క సమూహం వద్దకు వెళ్లి అభివాదం చేశారు. బండి సంజయ్ ను కలిసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీలు పడ్డారు. అందరితో సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగారు. అంతకముందు బండి సంజయ్ వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్ కు ఆలయ పూజారులు ఆశీర్వచనం అందించారు. అనంతరం కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో నిర్వహించే దాండియా వేడుకల్లో పాల్గొన్నారు.
బొమ్మకల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజక వర్గ ఇంఛార్జి పురుమల్ల శ్రీనివాస్ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సాంప్రదాయ బద్దంగా సమూహంగా బతుకమ్మ ఆటా`పాటలతో అలరించారు.