ఇప్పటి వరకు 71, 109 మందికి లబ్ధి
13 వేల ఫిర్యాదుల పరిష్కారానికి సర్వే
రూ. 2 లక్షలకు పైగా మరో 2, 100 ఫిర్యాదులు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. మూడు దశల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారి ఫిర్యాదుల మేరకు సర్వే చేపట్టింది. ఇందులో బాగంగా కరీంనగర్ జిల్లాలో సర్వే కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 13 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఆయా మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో విస్తరణ అధికారులు ఆయా నివాసాలకు వెళ్లి సర్వే కొనసాగిస్తున్నారు. గ్రామం యూనిట్‌గా బ్యాంకు బ్రాంచి, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి..సమస్యను గుర్తించి అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రభుత్వం పది రోజుల టార్గెట్ పెట్టినప్పటికీ, యాప్‌లో సాంకేతిక కారణాలతో సర్వే పూర్తికి మరిన్ని రోజులు పట్టే అవకాశాలున్నాయి.
జిల్లాలో రూ. 546. 36 కోట్ల లబ్ధి
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 2 లక్షల వరకు మూడు దశల్లో రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 71, 109 మంది రైతులకు రూ. 546.36 కోట్ల లబ్ధి చేకూరింది. జూలై 18న తొలివిడుత, 30న రెండో విడత, ఆగస్టు 15న మూడో విడుతలో లబ్ధి చేకూరని రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన వ్యవసాయ అధికారులు..సర్వే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మిగతా రైతులకు రుణమాఫీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా..రెండు లక్షలకు పైగా ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేయాల్సి ఉంది. అయితే..ఆ పైన రుణాన్ని రైతులు బ్యాంకు లకు చెల్లించిన తరువాతే ప్రభుత్వం రూ. 2 లక్షలు జమ చేయనుంది. ఈ కేటగిరీలో కూడా వ్యవసాయ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. రూ. రెండు లక్షలకు పైగా రుణాలున్న 2, 100 మంది రైతులు తమకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. తొలుత రూ. 2 లక్షల లోపు లబ్ధిదారులకు రుణమాఫీ పూర్తి చేశాక, ఆపై ఉన్న రైతు లకు లబ్ధి చేసే అవకాశాలున్నాయి.