మహిళ, పురుషులకు వేరువేరుగా ప్రవేశాలు
సదుపాయాలు, పోటీ పరీక్షలకు శిక్షణ
హైదరాబాద్ :
రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో స్ఫాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తన ఛాంబర్‌లో సంబధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..29 డిగ్రీ కాలేజీల్లో 14 పురుషుల, 15 మహిళా కాలేజీల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆయా డిగ్రీ కాలేజీల్లో 31 కోర్సులు ఉన్నాయని, ఇందులో మొదటి సంవత్సరం 9, 120 సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ప్రకారం భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా సీట్ల భర్తీ చేపట్టామని, మిగతా
సీట్లకు స్ఫాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
పురుషుల కోసం..
నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, భూపాల్‌పల్లి, నాగర్ కర్నూల్, భద్రాద్రి, మంచిర్యాల, భువనగిరి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లు ఉన్నాయని తెలిపారు.
మహిళలకు..
మహిళలకు సిద్దిపేట, కరీంనగర్, జనగాం, ఖమ్మం, నిజామాబాద్, మేడ్చల్, హైదరాబాద్, వనపర్తి, ములుగు, కామారెడ్డి, పెద్దపల్లి, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సూర్యాపేట, జోగులాంబ అలంపూర్, సంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీల్లో ఖాళీలున్నాయని తెలిపారు.
సదుపాయాలు..
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో రెగ్యురల్ కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు అందిస్తూ.. పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ ఇస్తామని ఆయన చెప్పారు. మొదటి సంవత్సరం నుండి సివిల్స్, గ్రూప్స్, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ, ఉన్నత ఉద్యోగాలకు అవసరమైన కెరీర్ గైడెన్స్ అందిస్తున్నామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తూ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కో-కరిక్యులమ్ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, గ్రూప్ డిస్కషన్, క్విజ్, డిబేట్, సోలో/గ్రూప్ డ్యాన్స్‌లు, భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు, సంగీత వాయిద్యాలు, సంగీతం, గానం, చిత్రలేఖనం తదితర సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సాహాలను కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు.
బీసీ గురుకులాల్లో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు
- Advertisment -