వీటితో పాటు టెస్కో పాలక వర్గం ఎన్నిక
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇంఛార్జి పర్సన్ల పాలన
ఎలక్షన్ల ప్రక్రియలో అధికార యంత్రాంగం..
రాష్ట్ర వ్యాప్తంగా 340 హ్యాండ్‌లూమ్ సొసైటీలు
కరీంనగర్ -జనత న్యూస్
చేనేత సహకార సంఘాల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఆగస్టు మాసంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆ శాఖ కమీషనర్ శైలజ రామయ్యార్ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. ఎన్నికల ప్రత్యేక అధికారిగా ఆర్‌డీడీ రతన్ కుమార్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఈ నెలతో అధికారుల బదిలీలు పూర్తికానున్నందున..వచ్చే మాసంలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఉన్నతాధికారులు, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. చేనేత సహకార సంఘాలతో పాటు టెస్కో పాలక వర్గ ఎన్నికలూ నిర్వహించనున్నారు.
వచ్చే మాసంలో రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. 2013 ఫిబ్రవరి మాసంలో చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా..ఆ తరువాత, ఇప్పటి వరకు ఎన్నికలు జరుగలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు ఆరున్నరేళ్లుగా పర్సన్ ఇంఛార్జి పాలనే కొనసాగుతూ వస్తోంది. గత కాంగ్రెస్ పాలన తరువాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి ప్రతీ ఐదేళ్ల కోసారి ఎన్నికలు జరుగాల్సి ఉండగా, ఇతర సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి చేనేత సంఘాల ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చింది గత ప్రభుత్వం.
రాష్ట్ర వ్యాప్తంగా 340 చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. సహకార, చేనేత`జైళిశాఖలు సంయుక్తంగా ఈ ఎన్నికలు నిర్వహించ నున్నాయి. ఇందులో భాగంగా ఆయా సంఘాల్లో డైరెక్టర్లను కార్మికులు నేరుగా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికారి పదవులను డైరెక్టర్లు ఎన్నుకుంటారు. ఆయా జిల్లాల్లో ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు..అనుబంధంగా టెస్కో డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఉమ్మడి జిల్లాకు ఒక టెస్కో డైరెక్టర్ చొప్పున పది జిల్లాలకు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. టెస్కో డైరెక్టర్లలో ఒకరిని ఛైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. చేనేత సహకార సంఘాల అధ్యక్ష పదవులు, టెస్కో డైరెక్టర్లు, ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 45 సంఘాలు..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే, కార్మికుల వివరాలు, ఇతరాత్ర ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. చేనేత సహకార సంఘాల అధ్యక్షులు టెస్కో డైరెక్టర్‌ను ఎన్నుకుంటారు.అయితే..కరీంనగర్ జిల్లా కో`ఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్, డీసీఎంఎస్ లలో కూడా రెండు నుండి మూడు చొప్పున డైరెక్టర్లను ఎన్నుకునే అవకాశాలుంటాయి. వచ్చే జనవరితో కేసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల కాల పరిమితి ముగియనున్నందున..వచ్చే పలక వర్గంలో చేనేత సంఘాల అధ్యక్షులు డైరెక్టర్లుగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.
పార్టీలకు అతీతంగా ఎన్నికలు
చేనేత సహకార సంఘాల పాలక వర్గాల ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పర్సన్ ఇంఛార్జీల్లో మెజారిటీ అధ్యక్షులు మళ్లీ పోటీ చేసి గెలిచే అవకాశాలున్నాయి. చేనేత పరిశ్రమ కుంచించుక పోతున్న ఈ పరిస్థితుల్లో పాలక వర్గ ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవ్వడం చర్చనీయాంశంగా మారింది.