కరీంనగర్, జనతా న్యూస్: జాతీయ జెండాకున్న ప్రాధాన్యత వెలకట్టలేనిదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 9వ రోజు రామడుగు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా రామడుగు మండలం గోపాల్ రావు పేట గుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సందర్శించిన బండి సంజయ్ ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్ధానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ తో కలిసి అంబులెన్స్ ప్రారంభించారు. గోపాల్ రావు పేట అంబేడ్కర్ కాలనీలో రూ. 5 లక్షల కేంద్ర నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే గోపాల్ రావుపేటలో నేచర్ యూత్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 56 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై జెండా ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో మాట్లాడుతూ భారత దేశ ఆశయాలకు, ఆదర్శాలకు ప్రతిరూపం ఈ మువ్వెన్నెల జెండా…. భరత జాతి స్వాతంత్య్రానికి గుర్తింపు ఈ జెండా. ఎన్నో మహత్తర ఆశయాల సంకేతంగా ఏర్పడిన ఈ త్రివర్ణ పతాకం 77 ఏళ్లుగా స్వతంత్ర్య భరత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతూ రెపరెపలాడుతోందని అన్నారు. ఈ జెండాను చూస్తే గాంధీ, బోస్, భగత్ సింగ్, సావర్కర్ వంట. స్వతంత్ర సాధన కోసం ఉద్యమించిన నేతల త్యాగం గుర్తొస్తుందని అన్నారు. ఎవరెస్టు ఎక్కినా.. చంద్ర మండలంపై అడుగు పెట్టినా.. అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో రాణించినా.. ఇలా విజయం సాధించిన ప్రతి సందర్భంలో కళ్ల ముందు కనిపించేది దేశపు జెండాయే. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకను ఎగరేయకపోతే ఆ విజయానికి విలువే ఉండదని బలంగా విశ్వసిస్తారు అంతా. ఆ త్రివర్ణ పతాకం అంతెత్తున రెపరెపలాడుతుంటే…ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది అని అన్నారు.