Saturday, March 14, 2026

Illegal Cola Business In Timmapoor: అక్రమ బొగ్గు దందా C/o గుండ్లపల్లి

  • జోరుగా చీకటి వ్యవహారం
  • కన్నెత్తి చూడని సింహాలు

 తిమ్మాపూర్, జనతా న్యూస్: సింగరేణి బొగ్గు… వే బిల్లుతో హైదరాబాద్ కి వెళ్లాలి. అయితే కొందరు ఘనులు మధ్యలోనే మాయం చేస్తున్నారు. అడ్డదారిన బొగ్గును అమ్ముకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. చీకట్లో జోరుగా సాగుతున్న అక్రమ బొగ్గు దందాకు గుండ్లపల్లి అడ్డాగా మారింది. నిత్యం రాత్రి లారీల్లో బొగ్గు అన్ లోడింగ్, లోడింగ్ జరుగుతోంది. చీమ చిటుక్కుమన్నా పట్టుకునే సింహాలు వందలాది లారీల్లో అక్రమ బొగ్గు దందా కొనసాగుతున్నా కన్నెత్తి చూడడం లేదు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు లారీల ద్వారా హైదరాబాద్ ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమలకు తరలిపోతుంది. రాజీవ్ రహదారిపై నిత్యం వందలాది లారీలు బొగ్గును తరలిస్తున్నాయి. సింగరేణి ప్రాంతం నుండి పరిశ్రమలు తరలుతున్న బొగ్గును కొందరు అక్రమార్కులు చీకటి దందాగా మార్చేస్తున్నారు.

gundlapally coal businell 2
gundlapally coal businell 2

వే బిల్లు ద్వారా లారీల్లో తరలిస్తున్న బొగ్గును మార్గమధ్యలోనే మాయం చేస్తున్న ఘనులు అక్రమ దందాకు తెరలేపుతున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లెను అడ్డాగా చేసుకుని కొందరు అక్రమార్కులు బొగ్గు అక్రమ దందాను యధేచ్చగా కొనసాగిస్తున్నారు. రేణికుంట టోల్ ప్లాజా దాటగానే గుండ్లపల్లెలోని రహస్య ప్రాంతాలకు బొగ్గు లారీలను తరలిస్తున్నారు. ఒక్కో లారీ నుండి కొంత మేరకు నాణ్యమైన బొగ్గును డంపే చేసి అందులో నాణ్యతలేని బొగ్గును నింపుతూ పరిశ్రమలకు పంపిస్తున్నారు. డంప్ చేసిన తరువాత మిగతా బొగ్గుకు నీటిని పట్టిస్తూ బరువు పెరిగేలా చేస్తున్నారు మరికొందరు అక్రమార్కులు. పదుల సంఖ్యలో లారీల నుంచి డంప్ చేసిన నాణ్యమైన బొగ్గును వేరే లారీలో లోడ్ చేసి విక్రయిస్తున్నారు. అక్రమంగా నింపిన బొగ్గు లారీలను తరలించేందుకు ఒక్కో వే బిల్లును రెండుసార్లు కొందరు వినియోగిస్తుంటే, మరికొందరు ఇటుక బట్టీలకు బొగ్గును తరలిస్తున్నారు. గుండ్లపల్లి స్టేజీ సమీపంలోనే ఏడు చోట్ల బొగ్గు అక్రమ దందా కేంద్రాలు కొనసాగుతున్నాయి. గతంలో లారీల్లో లోడ్ చేసి పంపిన అక్రమార్కులు ఇప్పుడు చిన్నచిన్న టిప్పర్లలో సైతం లోడ్ చేసి అక్రమంగా బొగ్గును రవాణా చేస్తున్నట్లు సమాచారం. బొగ్గు టన్నుకు సుమారు రూ. 8వేల వరకు ధర పలుకుతుంటే… గుండ్లపల్లి వద్ద డంపింగ్ అవుతున్న వందల టన్నుల బొగ్గు అక్రమంగా రవాణా అవుతోంది.

gundlapally coal businell 3
gundlapally coal businell 3
కన్నెత్తి చూడని సింహాలు..

గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజీ సమీపంలో బొగ్గు అక్రమ దందా కొనసాగుతుంటే సింహాలు కన్నెత్తి చూడడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా సాగుతున్న చీకటి వ్యవహారం విషయంలో సింహాలు ఎందుకు గర్జించడం లేదనేది అంతులేని ప్రశ్నే. రాత్రి పూట సైతం తిరిగే సింహాల కంట చీకటి దందా పడకపోవడం విడ్డూరమే. ఉన్నతాధికారి మారడంతో కొద్ది రోజులు బొగ్గు అక్రమ దందాకు బ్రేక్ వేసిన అక్రమార్కులు ఇటీవల మళ్లీ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే తమను ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో అక్రమార్కులు రెచ్చిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. సింహాలు మౌనంగా ఉండడం వెనుక మనీ మతలబు ఉందనే ఆరోపణలున్నాయి. అయితే కడుపు నిండుతున్నందునే సింహాలు గర్జించడం లేదనే విమర్శులున్నాయి. అక్రమ బొగ్గు దందాపై పోలీసుశాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపడితే నిజాలు నిగ్గుతేలుతాయని స్థానికులు అంటున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page