జిల్లాలో ఏర్పాటుకు సన్నహాలు
చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు చర్యలు
ఇప్పటికే జిల్లా అధికారుల సమావేశం
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. రాజకీయ కోణం ఎలా ఉన్నా..ఇక నుండైనా చెరువులు, కుంటలు, నాలాలు, నీటి వనరులు గల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉండే అవకాశాలుంటాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది ఒక హైదరాబాద్ తరహాలోనే ..ఇతర నగరాలు, పట్టణ పరిసరాల్లో సైతం ప్రత్యేక ఏజెన్సీలు ఏర్పాటు చేసి చట్ట బద్దత కల్పించే అలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా కరీంనగర్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రోటక్షన్ పేరుతో ప్రభుత్వ ఏజెన్సీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్‌తో పాటు సుడా పరిధిలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలను ఇందులో చేర్చి ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది.
వర్షాలు కురిస్తే లోతట్టు నివాసిత ప్రాంతాలు జలమయ మౌతున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు అన్యాక్రాంతం కావడంతో..మురుగు నీటి వరద జనావాసాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. జలాశయాలు కనుమరుగు కావడంతో భూ గర్భ జలాలు సైతం అడుగంటుతున్నాయి. రానున్న కాలంలో నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడేందుకు హైదరాబాద్‌లో హైడ్రా ఏజెన్సీ ద్వారా పరిరక్షణ చర్యలు ముమ్మరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఏజెన్సీల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కడ్రా పేరుతో మరో ఏజెన్సీను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు సమాచారం.
కరీంనగర్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రోటక్షన్ (కాడ్ర) పేరుతో ప్రభుత్వ ఏజెన్సీ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించినట్లు సమాచారం. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, సుడా సీపీవో, రెవెన్యూ, పోలీసు అధికారితో గల ప్రభుత్వం కమీటీని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దీనికి ఐపీఎస్ లేదా ఐఏఎస్ స్థాయి అధికారిలో ఎవరినో ఒకరిని నియమించే అవకాశాలుంటాయి. అయితే..దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వూలేవీ రాలేదు.
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌తో పాటు శివారు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు అనేక ఆరోపనలున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర జలాశయాలు కబ్జాకు గురైనట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. ఒక్క బొమ్మకల్ గ్రామంలోనే వందలాదిగా ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మల్లయ్య, జక్కప్ప, రావికుంట, గోపాల్ చెరువు, నల్ల చెరువు, గోదుమ కుంట..ఇలా బొమ్మకల్‌లోని ఆయా జలాశయాలు అన్యాక్రాంతానికి గురైనట్లు ఆరోపనలున్నాయి. రేకుర్తిలోని నద్దినాల (బఫర్ జోన్), తీగలగుట్టపల్లి, సీతారాంపూర్..చొప్పదండి మండలంలోని బ్రాహ్మిణి కుంట..ఇలా అనేక ప్రాంతాల్లోని జలాశయాలు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులున్నాయి. వీటిపై కడ్రా కమిటీ విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశాలపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరీశీలన, క్రమ బద్దీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ మంత్రి పలు సార్లు ఈ విషయాలపై జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఆర్‌వోఆర్ కొత్త చట్టంలోనూ వీటి పరిరక్షణను పొందు పర్చే అవకాశాలు కూడా లేక పోలేదు. భవిష్యత్‌లో జలాశయాల పరిరక్షణతో పాటు అన్యాక్రాంతానికి గురైన చెరువులు, కుంటల్లోని భవనాలు, ఇతర నిర్మాణాల తొలగింపుపై ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే..కడ్రా ఏర్పాటు విషయమై కొద్ది రోజుల్లో ప్రభుత్వం నుండి స్ఫష్టత వచ్చే అవకాశం ఉంది. ఏజెన్సీ ఏర్పాటు అవుతుందా..లేదా..అనే దానిపై వేచి చూడాలి మరి.