Friday, July 4, 2025

హైడ్రా తరహా జిల్లాలో చర్యలు..

సీఎం ప్రకటనతో అక్రమార్కుల్లో గుబులు..
శిఖం, ప్రభుత్వ భూములపై అధికారుల ఫోకస్‌ ?

జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి

భారీ వర్షాలు పడితే..ఆ నష్టం ఎంత మేరకు ఉంటుందో ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లోని ఈ అనుభవం ద్వారా తెలిసింది. ఎక్కువ శాతం చెరువులు, కుంటలు, వాగులు ఆక్రమణకు గురై కుంచించుక కోవడం, ఆనవాళ్లూ కూడా లేకుండా పోవడంతో వరద పల్లెలను ముంచెత్తుతున్న దృష్యాలు ఆలోచింప జేస్తున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి పలు జిల్లాల్లో పర్యటన చేసిన అనంతరం మహబూబా బాద్‌ జిల్లాలో చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలోనే జిల్లాల్లోని చెరువులు, కుంటల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. కరీంనగర్‌ జిల్లాలో శిఖం, ప్రభుత్వ భూముల కబ్జాలపై గతంలో కలెక్టర్‌కు భారీగా ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని విచారణ కొనసాగిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా సీఎం ప్రకటనతో ఆయా గ్రామాలు, పట్టణాల నుండి అధికారులకు భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తే అవకాశాలున్నాయి.

హైదరాబాద్‌లో ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ ఆధ్వర్యంలో ఏర్పడ్డ హైడ్రా సంస్థ ఆక్రమణలను తొలగిస్తూ, అధికారులపై సైతం క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ తరహా సంస్థలు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వినతులు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన తాజాగా ప్రకటన కరీంనగర్‌ జిల్లాలో చర్చకు తెర లేపింది. పక్షం రోజుల క్రితమే ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి, పలువురు అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించారు. ఇక ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయితే కార్యచరణలో చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రాష్ట్ర మంత్రి పొన్నం సైతం..
చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేయాలని ఇటీవల రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని పలు పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు జిల్లాలోని చెరువులు, కుంటలను పరి రక్షించాలని, ఇందుకు హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల నుండి సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలో, అదే స్థాయిలో కొన్ని వర్గాల నుండి ప్రభుత్వానికి ఒత్తిళ్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

గత ఫిర్యాదులపై చర్యలుంటాయా ?
జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లోని చెరువుల శిఖం భూముల కబ్జాలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని ఫిర్యాదులపై విచారణ కూడా చేపట్టారు అధికారులు. అయితే.. ప్రస్తుతం ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానంగా కరీంనగర్‌ శివారులోని బొమ్మకల్‌ గ్రామంలోని సుమారు ఆరు చెరువుల్లోని శిఖం భూములు కబ్జాకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదులతో పోలీసు అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. అనేక చోట్ల నిర్మాణాలు కూడా వెలిశాయి. వాటిని కూల్చి వేస్తారా..? లేక చూసీ చూడనట్లు వ్యవహరిస్తారా..? ఇలా పలు సందేహాలు వ్యక్త మౌతున్నాయి.

శివారులోని ఫిర్యాదులు ఇవీ..
నగర శివారులోని బొమ్మకల్‌ గోదుమకుంట చెరువు శిఖం సర్వే నెంబర్‌ 250లో ఐదు ఎకరాలు, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ వెనుక సర్వే నెంబర్‌ 105లో కొంత భూమి కబ్జా అయినట్లు ఆరోపనలున్నాయి. రాయికుంట చెరువుకు చెందిన సర్వే నెంబర్‌ 28లో 9.4 ఎకరాల శిఖం భూమి ఉంటే..ఇందులో ఒక చోట 8 ఎకరాలు, మరోచోట 16 గుంటలు..మరొకరు 20 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఫిర్యాదులున్నాయి. ఇదే గ్రామంలోని సర్వే నెం.728 గోపాల్‌ చెరువు 28.10 ఎకరాల శిఖం భూమిలో ఎస్టీపీ ప్లాంటు నిర్మాణానికి ప్రభుత్వం 10 ఎకరాల స్థలం పోనూ.. మిగతా శిఖం భూమిలో ఆక్రమాలు యథేచ్చగా జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. సర్వేనెంబర్‌ 96లో జక్కప్ప చెరువుకు చెందిన 46.21 గుంటల శిఖం భూమిలో 12 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్లు విమర్శలున్నాయి. దీంతో పాటు సర్వే నెంబర్‌ 208 లోని నల్లచెరువు 28.37 ఎకరాల శిఖం భూమిలో 7 ఏకరాలు, సర్వే నెంబర్‌ 105లో నాలుగు ఎకరాల రెండు గుంటలు, 765 సర్వే నెంబర్‌లో 10 గుంటలు..797లో 15 గుంటలు..656లో 9 గుంటల స్థలం కబ్జాకు గురైనట్లు ఆరోపనలున్నాయి. ఇందులో అనేక చోట్ల రెవెన్యూ, పంచాయతీ అధికారులు విచారణ చేపట్టి హద్దులు నిర్ణయించారు. కాని కొందరు వాటిని చెరిపేసి దర్జాగా ఆక్రమణలు కొనసాగించారు.

అధికారులపై చర్యలుంటాయా..?
పోహిబిటెడ్‌ ప్రాపర్టీ యాక్డ్‌ 22ఏ ప్రకారం..ప్రభుత్వ స్థలాలు, శిఖం భూములను ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్‌ చేయరాదు. కాని బొమ్మకల్‌లోని అనేక సర్వే నెంబర్లలోని శిఖం, ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేశారు అధికారులు. ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులపై గాని..చేయించుకున్న వారిపై గాని ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. ఆ ఫైళ్ళను ఇప్పటి వరకు తీయలేదు. కనీసం విచారణ కూడా చేపట్టక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఒక బొమ్మకల్‌ గ్రామమే కాదు, నగర శివారు గ్రామాల్లో రేకుర్తి, కొత్తపల్లి, ఇతర చొప్పదండి తదితర పట్టణాల్లోని చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురైనట్లు జిల్లా రెవెన్యూ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. వీటిపై సమగ్ర విచారణ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page