-
ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత
-
హుజూరాబాద్ పై వొడితెల కుటుంబ పట్టు
-
తాత సేవలు కలిసొచ్చేనా?
-
బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
కరీంనగర్, జనతా న్యూస్: పోరాటాల ఖిల్లా కరీంనగర్ జిల్లా తెలంగాణలోనే ప్రత్యకంగా నిలుస్తుంది. ఇక్కడి రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీ నాయకుల చూపు కరీంనగర్ జిల్లాపైనే ఉంటుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పొలిటికల్ హీటకెక్కిస్తుంది. బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్, బీజేపీలు తలపడుతున్నాయి. ఇందులో హుజూరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2022 ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ కు సైతం గట్టి పోటీ ఇచ్చిన నియోజకవర్గంగా పేర్కొంటారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గ కేంద్రంలోనే ప్రకటించడం విశేషం. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలో త్రిముఖ పోరు సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి బరిలో ఉండగా.. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రణవ్ బాబు పట్టు సాధించేందుకు రంగంలోకి దిగాడు.
‘హుజూరాబాద్’ లపై ‘వొడితెల’ పట్టు..
హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గంపై వొడితెల కుటుంబం పట్టు ఉంది. వొడితెల రాజేశ్వర్ రావు ఈ రెండు నియోజకవర్గాల్లో కీలకంగా ఎదిగారు. 1972లో కమలాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.1992లో ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎంపిగా కొనసాగారు. ఆ తరువాత తన వారసుడిగా రాజేశ్వర్ రావు సోదరుడు వొడితెల లక్ష్మీకాంతారావు రాజకీయాల్లోకి వచ్చారు. ఈయననే కెప్టెన్ లక్ష్మీకాంతారావు అని పిలుస్తారు. ఈయన తరువాత ఆయన కుమారుడు వొడితెల సతీష్ బాబు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అయితే వొడితెల కుటుంబం నుంచి వచ్చిన మరో కీలక నేత ప్రణవ్ బాబు. ఈయన వొడితె రాజేశ్వర్ రావు మనువడు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి..
ప్రణవ్ బాబు మొదటి నుంచి బీఆర్ఎస్ లో కొనసాగారు. అయితే హుజూరాబాద్ టికెట్ తనకే వస్తుందని ఆశించారు. కానీ అధిష్టానం పాడి కౌశిక్ రెడ్డికి కేటాయించింది. దీంతో ఆయన అక్టోబర్ 6న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. అప్పటికే హూజూరాబాద్ లో సరైన నాయకత్వం కోసం ఎదరుచూస్తున్న అధిష్టానానికి ప్రణవ్ బాబు చేరికతో బలం వచ్చినట్లయింది. ఎందుకంటే వొడితెల కుటుంబనకు హుజూరాబాద్ నియోజకవర్గంలో మంచి ఆదరణ ఉంది.