Saturday, March 14, 2026

భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం

హైదరాబాద్‌, జనతా న్యూస్: తెలంగాణలో ఎండలు అదరగొడుతున్నాయి. బయటికి వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు. అత్యవసరమైతేనే కాలు బయటపెడుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లినా వెంటనే తిరిగి వస్తున్నారు. ఎండ వేడిమి కి తట్టుకోలేక శరీరాన్ని చల్లబరుచుకునేందుకు ఫ్యాన్‌ లేదా కూలర్‌ లేదా ఏసీలను వాడుతున్నారు. ఫలితంగా విద్యుత్‌ వినియోగం తారా స్థాయికి చేరుకుంటోంది.
హైదరాబాదులో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ ను డిమాండ్‌ కు తగ్గట్టుగా సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవల వరకు ట్రాన్స్‌ ఫార్మర్ల పవర్‌ (సామర్థ్యం) పెంచే పనులు చేపట్టారు. ఇప్పుడు డీటీఆర్‌(డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌) లను మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు.ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలకు ఏమాత్రం విశ్రాంతి ఉండడం లేదు. ముఖ్యంగా తెలంగాణ పరిధిలోని హైదరాబాదులో మార్చి, ఏప్రిల్‌ నెలలో డిమాండ్‌ తారాస్థాయికి చేరింది. పలు సబ్‌ స్టేషన్లలో 80 శాతం కంటే ఎక్కువ లోడ్‌ ఉన్న పవర్‌ ట్రాన్స్‌ ఫార్మర్లను ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటితో మార్పు చేశారు. అంతేకాదు పలు కాలనీలో ఉండే డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ ఫార్మర్లను అధికారులు మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉండే సమయంలో డీటీఆర్‌ ల ఖచ్చితమైన లోడ్‌ గుర్తించే మదింపు చేపడుతున్నారు. టంగ్‌ టెస్టర్‌ ద్వారా లోడ్‌ గుర్తించి విద్యుత్‌ సిబ్బంది రికార్డ్‌ చేస్తున్నారు. అయితే ఈ పనిని వారు రాత్రిపూట చేపడుతున్నారు..విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ సాధారణంగా సాయంత్రం సమయంలో ఉంటుంది.

ఈ ఏడాది విద్యుత్‌ వినియోగం తీరు పూర్తిగా మారిపోయింది. ఒక్కో సర్కిల్లో ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా నమోదవుతోంది. ఐటీ కార్యాలయాలు, బహుళ అంతస్తులు ఉన్న సైబర్‌ సిటీ ప్రాంతాల్లో ఏప్రిల్‌ 5న రికార్డు స్థాయిలో 784.4 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదయింది. గత ఏడాది ఏప్రిల్‌ 20వ తేదీన గరిష్టంగా నమోదైన 455 మెగావాట్ల కంటే ఇది చాలా ఎక్కువ. నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలలో పీటీఆర్‌ సామర్ధ్యాన్ని పెంచినప్పటికీ డిమాండ్‌ అధికంగానే నమోదవుతున్నది. ఈ సర్కిల్‌ పరిధిలో రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య విద్యుత్‌ డిమాండ్‌ స్టేజీ లో ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇక రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ప్రాంతంలో సాయంత్రం ఐదు గంటల సమయంలో అత్యధిక లోడ్‌ రికార్డు అవుతోందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 3న అత్యధికంగా 674 మెగావాట్ల డిమాండ్‌ నమోదయిందని చెబుతున్నారు.

గత ఏడాది ఏప్రిల్‌ 16న గరిష్ట డిమాండ్‌ 649.9 మెగావాట్ల డిమాండ్‌ నమోదయింది. ఇక సరూర్‌ నగర్‌ డివిజన్‌ ప్రాంతంలో ఏప్రిల్‌ 5న అత్యధికంగా 292.3 మెగావాట్ల డిమాండ్‌ నమోదయింది. గత ఏడాది ఏప్రిల్‌ 6న 288 మెగావాట్ల డిమాండ్‌ రికార్డ్‌ అయింది. వాస్తవానికి ఈ సర్కిల్‌ పరిధిలో నివాసాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య విద్యుత్‌ వినియోగం తారాస్థాయికి చేరుతోంది.హైదరాబాద్‌ నగరం మాత్రమే కాకుండా రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే స్థాయిలో విద్యుత్‌ వినియోగం ఉంది. ఇక కరీంనగర్‌, వరంగల్‌, ఉమ్మడి పాలమూరు, నిజామాబాద్‌, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌ వంటి జిల్లాల్లోనూ విద్యుత్‌ వినియోగం తారాస్థాయికి చేరుతోంది. అయితే ఏప్రిల్‌ కంటే మే లో ఎక్కువగా ఎండలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి.. విద్యుత్‌ వినియోగం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు..

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page