నివేషన స్థలాల కేటాయింపులో అన్ని అక్రమాలే..
అనర్హులకు జారీ చేశారని ఆరోపణలు
నివేషణ స్థలాల కేటాయింపు వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్
జిల్లా కలెక్టర్ కు టియుడబ్ల్యూజె ఐజేయు నేతల ఫిర్యాదు.
కరీంనగర్, జనతా న్యూస్: జర్నలిస్టుల పేరిట కరీంనగర్ లో పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ పట్టాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఈ పట్టాలను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిమాండ్ చేసింది. తక్షణమే దీనిపై విచారణ జరిపి , వారిపై చర్య తీసుకోవాలని మంగళవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.
పౌరసరఫరాల శాఖలో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న జర్నలిస్టు సంఘానికి జిల్లా నేతగా చలామణి అవుతూ, బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వద్ద క్తిగత సహాయకునిగా పనిచేస్తూ, అంగట్లో సరుకులా అమ్ముకున్నారని సంఘం నేతలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మంత్రి, నగర మేయర్ వద్ద పీఆర్వోలుగా పని చేస్తున్న వ్యక్తులకు జర్నలిస్టుల కోటాలో
నివేశన స్ధలాలు కట్టబెట్టడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు.
జర్నలిజంలో దశాబ్దకాలం, ఆపై అనుభవం ఉన్న వారి పేర్లను, తమకు అనుకూలంగా లేరనే సాకుతో పక్కన పెట్టించిన మంత్రి, గతంలో నివేశన స్థలాలు పొందిన తన వారికి మాత్రం మరోసారి నివేశన స్థలం కేటాయించడం చుాస్తే, జరిగిన అక్రమాల్లో మంత్రి ప్రమేయం స్పష్టంగా ఉందని అర్ధం అవుతుందన్నారు. అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యూనియన్ ప్రతినిధి బృందం కలెక్టర్ కు తెలియజేసింది. దీనిపై తక్షణం చర్య తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర గవర్నర్ కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.