పారిశ్రామిక వేత్తలకు పురాతన ప్రాంతాల లీజు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పర్యాటకుల ఆశలు
కరీంనగర్, నిజాబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో..
శిథిలావస్థలో పురావస్తు కట్టడాలు
ఖాళీల భర్తీపై స్పష్టత కరువు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
హైదరాబాద్‌లో పురాతన, చారిత్రాత్మక భవనాలు, ప్రదేశాల అభివృద్ధి, నిర్వహణను పారిశ్రామికులకు అప్పగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. శుక్రవారం హైదరాబాద్‌లో పురాతన మెట్ల బావుల పునరుద్దరణపై పారిశ్రామిక వేత్తలతో ఒప్పందం చేసుకుంది సర్కారు. రానున్న కాలంలో సిటీ కాలేజ్ భవనం,పురానాపూల్ వంతెన, హైకోర్టు భవనం లాంటి చారిత్రక కట్టడా లనూ పరిరక్షిస్తామమని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నిర్ణయంపై పర్యాటకుల్లో సంతోషం వ్యక్త మౌతోంది. ఇక్కడి వరకు భాగానే ఉన్నా..తెలంగాణా లోని ఆయా జిల్లా ల్లోనూ ప్రాచీన, చారిత్రాత్మక కోటలు, దేవాలయాలు అనేకం ఉన్నాయి. అవి ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని ప్రభుత్వం పరిరక్షిస్తుందా..? లేక హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
హైదరాబాద్ లోని పురాతన, చారిత్రాత్మక ప్రదేశాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నా..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటలు, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఆనాడు నిజాం నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న చారిత్రాత్మక ఆస్తులు సుమారు 350 వరకు ఉన్నట్లు అంచన. అయితే..ఇంకా వందల సంఖ్యలో ఉండే అవకాశాలున్నా పరిశోధనలు చేయక పోవడంతో అన్యాక్రాంతమౌతున్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు పురావాస్తు, పర్యాటక శాఖల పరిధిలో ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఫేమస్ కోటలు, బావులు, కోటల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.
కరీంనగర్ ఏడీ పరిధిలో 95 ప్రదేశాలు..
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పురావస్తు శాఖ శాఖ సహాయ సంచాలకుల పరిధిలో 95 చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇందులో 15 ముఖ్యమైన కోటలున్నాయి. వీటితో పాటు అనేక దేవాలయాలూ పరిరక్షణను నోచుకోక పోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కరీంనగర్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ముస్లిం రాజులు పాలించిన ఎలగందల్ ఖిల్లా ఉంది. ఇక్కడ అనేక ప్రత్యేకతలున్నాయి. వందలాది మంది పర్యాటకులు ప్రతీ రోజు ఈ కోటను దర్శిస్తూ ఉంటారు. శంకరపట్నం మండలం మొలంగూర్ కోటకూ ప్రత్యేక ఉంది ఇక్కడ ట్రెక్కింగ్‌కు వస్తూ ఉంటారు. ఇక్కడి దూద్ బావి ఫేమస్. పెద్దపల్లి జిల్లా రామగిరి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో పలు చారిత్రాత్మక కోటలున్నాయి. అవి పరిరక్షణకు నోచుకోక పోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. పురావస్తు శాఖ కరీంనగర్ జిల్లాలో గతంలో నిర్విహంచిన సర్వేలో దాదాపు 80 శాసనాలు సేకరించారు.
ఆదరణకు నోచుకోని ఆలయాలు..
జగిత్యాల జిల్లా రాయికల్ లో 1305 కు చెందిన అముద్రిత త్రికుటాలయ శాసనం,కరీంనగర్ జిల్లా నగునూరులోని రామలింగాల గుడి వద్ద శిథిలమైన రాతి శాసనాలు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో ధూళికట్టలో ప్రసిద్ధ భౌద్దారామం ఉంది. 1975 నుంచి 1977 వరకు పురావస్తు శాఖ జరిగిన తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి కోటలు, బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి. మంథనిలో బౌద్ధ, జైన కాలం నాటి క్షేత్రాలున్నాయి. శీలేశ్వర, సిద్ధేశ్వరాలయాలు, వరదరాజ స్వామి ఆలయం లాంటివి 20 వరకు ఉన్నాయి. ఇంకా అనేక చారిత్రక ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి.
చారిత్రక కట్టడాలు పరిరక్షించేనా..?
హైదరాబాద్ తరహాలో కనుమరుగు అయ్యేందుకు సిద్దంగా ఉన్న చారిత్రక కోటలు, ఆలయాల అభివృద్ధికి ప్ర్రభుత్వం చొరవ చూపితే భవిష్యత్ తరాలకు సజీవంగా నిలుస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆయా ప్రాంతాల్లోని పురాతన, చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసి ఆయా ప్రాంతాల్లో వెడ్డింగ్ షూట్స్, ఇతర కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాలుంటాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
పురాతన శాఖలో ఖాళీల భర్తీపై..
చారిత్మ్రాక కట్టడాల పరిరక్షణ, పరిశోధనలు నిర్వహించే పురావస్తు శాఖలో ఉద్యోగ ఖాళీలు వెంటాడుతున్నాయి. దీంతో ఆ శాఖ కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ ఏడీ పరిధిలో 19 రెగ్యులర్ పోస్టులకు 12 ఖాళీలు ఉండడం, వీటికి తోడు నిధులు కేటాయించక పోవడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశోధనలు చేయలేని దుస్థితి ఏర్పడిరది. కనీసం ఆయా ప్రాంతాల్లో చౌకీదార్లనైనా నియమిస్తే ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయనే అభిప్రాయాలూ వ్యక్త మౌతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.