గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో..
కుప్పలు తెప్పలుగా గుట్కా, పొగాకు నిల్వలు
ఏళ్ల తరబడి స్టోర్ చేసిన అధికారులు
ఆఫీసుకు తాళం..స్పందించని జీఎఫ్‌ఎస్‌ఓ
ేఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
ఇదేనా ‘స్వచ్ఛదనం`పచ్చదనం’ ?
జనత న్యూస్- కరీంనగర్ ప్రతినిధి
ఇదిగో..ఈ ఫోటోలు చూడండి ! కాలం చెల్లిన గుట్కా ప్యాకెట్లు, పాన్ మసాలా డబ్బాలు. గుట్టగా పేరుక పోయి ఎలా ఉన్నాయో..!! ఇదెక్కడనుకుంటున్నారా ? కరీంనగర్ నడీ బొడ్డున మాతా శిశు ఆసుపత్రి పక్కనే గల ఫుడ్ సేఫ్టీ ఆఫీసు డాబా పైన. వీటిని చూస్తే..సుమారు మూడేళ్లుగా ఇలానే పడి ఉన్నట్లు ఆర్థమౌతోంది. ఆఫీసు స్లాబ్ పైనే కాకుండా..ఆఫీసులోని మరో రెండు స్టోర్ రూమ్‌లు తెరిస్తే..ఇలాంటివే కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. ఈ గుట్కాల దుర్వాసనను ఫర్ లాంగ్ వరకున్న స్థానికులు భరించాల్సి వస్తుంది.
ఇక వివరాల్లోకొస్తే..
పొగాకు ఉత్పత్తుల నిషేదం నేపథ్యంలో.. కరోనా కాలంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు పట్టుకున్న గుట్కా ప్యాకెట్లు, జర్జా డబ్బాలను కరీంనగర్ గెజిటెడ్ ఫుడ్ ఆఫీసులో హ్యాండోవర్ చేశారు పోలీసులు. 2020 నుండి రెండున్నరేళ్ల వరకు పట్టుకున్న గుట్కా ప్యాకెట్లు ఈ కార్యాలయంలో భారీగా పేరుక పోయాయి. స్టోర్ రూమ్‌ల్లో నిల్వ చేయగా మిగిలిన ప్యాకెట్లను ఇలా స్లాబ్ పైన గుట్టగా పడేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఏళ్ల తరబడి అలానే పడి ఉండడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ..విపరీతమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఇది ఈ ఆఫీసు వరకే పరిమితం కాకుండా..పక్కనున్న మాతా శిశు ఆసుపత్రిలోకి విస్తురిస్తోంది.
పట్టించుకునే నాథుడే కరువు..
పట్టుకున్న గుట్కా ప్యాకెట్లను నిల్వ చేయకుండా వాటిని కాల్చి వేయడం, లేదా భూమిలో పాతి పెట్టే చర్యలు చేపట్టాలి. వీటిని ఎవరి నుండి స్వాధీనం చేసుకున్నారో..వారికి అదనపు కలెక్టర్ ద్వారా ఫైన్ వేయించాల్సి ఉంది. ఇక్కడ ఈ చర్యలేమీ చేపట్టలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలేవీ లేనట్లు సమాచారం. ఫలితంగా కాలం చెల్లిన గుట్కా ప్యాకెట్ల దుర్వాసతో స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసు చుట్టూ ఆసుపత్రులే ఉన్నాయి. ఈ దుర్వాసనను రోగులు, స్థానికులు భరిస్తున్నారు.
ఇదేనా ‘స్వచ్ఛదనం`పచ్చదనం’ ?
ఈ నెల 5 నుండి 9 వరకు స్వచ్ఛదనం`పచ్చదనం కార్యక్రమం చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వీధుల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపడుతున్నారు అధికారులు. కాని.. ఇక్కడి గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసులో మాత్రం సీన్ రివర్స్. పాడైపోయిన ఫర్నీచర్, చెత్తను కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా పడేసి ఉంచారు. దీంతో ఈ ఆఫీసులో దుమ్ము `దూళీ, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రిజిస్టర్లు, ఇతర పేపర్లు ఇష్టారీతిన పడి వేయడం బట్టి చూస్తే..ఆఫీసు నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది.
ఆఫీసుకు తాళం
ఫుడ్ సేఫ్టీ ఆఫీసుకు ఎప్పుడెళ్లినా తళం వేసే ఉంటుందనే విమర్శలున్నాయి. గెజిటెడ్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ నాయక్, ఇంఛార్జి ఫుడ్ ఇన్స్‌పెక్టర్ ఆఫీసు వేళల్లో కనిపించిన దాఖలాలుండవు. శుక్రవారం ఉదయం వేళల్లో ఆఫీసుకు తాళం వేసి ఉండడంతో..జీఎఫ్‌ఐ నాయక్‌ను ‘జనత ప్రతినిధి’ ఫోన్లో వివరణ కోరగా..బదిలీల ప్రక్రియలో బిజీగా ఉన్నామని, ఇక్కడి ఆఫీసు విషయాలు ఫుడ్ ఇన్స్‌పెక్టర్ చూసుకుంటారని, తనకు ఇంకేమి తెలియదని చెప్పడం గమనార్హం.