కార్మికుల సమ్మె విరమణ
రెండు నెలల వేతనాల విడుదల
మరో వారంలో నెల జీతాలిస్తామని హామీ
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులు సమ్మె విరమించారు. మూడు నెలల వేతనాలతో పాటు ఇతర సమస్యలపై శుక్రవారం ఉదయం మెరుపు సమ్మెకు దిగిన కాంట్రాక్టు కార్మికులు..శనివారం సాయంత్రం వరకు కొనసాగించారు. ఆసుపత్రిలో పారిశుధ్య, ఇతర సేవలు నిలిచి పోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆసుపత్రి అధికారులు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో..స్పందించి రెండు మాసాల వేతనాలను విడుదల చేశారు. ఆసుపత్రిలోని సమ్మె శిబిరం వద్దకు వచ్చిన ఆర్‌ఎం నవీన..ఈ విషయం వెల్లడిరచడంతో సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేకర్ ప్రకటించారు. కార్మికుల మరో నెల వేతనం వారంలోగా విడుదల చేస్తామని ఆసుపత్రి సూపరిండెంట్ వీరా రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు శేఖర్ తెలిపారు.