Thursday, July 3, 2025

ప్రభుత్వ డయాగ్నస్టిక్‌ హబ్‌కు సుస్తి !

ఐదు రోజులుగా నిలిచిన సేవలు..
ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన రక్త నమూనాల సేకరణ
రూ. వేలల్లో ఖర్చు చేసి ప్రయివేటు ల్యాబ్‌లో టెస్టులు
స్పందించని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు
జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ప్రభుత్వ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు సుస్తి చేసింది. యంత్రాలు పనిచేయక పోవడంతో వేలాదిగా బ్లడ్‌ షాంపిల్స్‌ హబ్‌లోనే నిలిచి పోయాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షల నమూనాల స్వీకరణ నిలిపి వేశారు. దీంతో నిరుపేద, మధ్య తరగతి రోగులు ప్రయివేటు ల్యాబ్‌ లకు వెళ్లాల్సి వస్తోంది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలోని టీ`హబ్‌ యంత్రాలు పనిచేయక పోవడంతో గత ఐదు రోజులుగా రోగ నిర్ధారణ పరీక్షలు జరుగడం లేదు. సంబంధిత ఇంజనీర్‌ మరమ్మతులు చేపట్టక పోవడంతో యంత్రాలు పనిచేయక టెస్టులు జరుగడం లేదు. దీంతో రోగులు ఆర్థికంగా, అనారోగ్య పరంగా నష్టపోతున్నారు.

కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి రోగులతో కిట కిట లాడుతోంది. సీజనల్‌ వ్యాధులతో ట్రీట్‌మెంట్‌ కోసం ఆసుపత్రికి చికిత్స కోసం వందలాది మంది రోగులు వస్తున్నారు. డాక్టర్‌ రోగిని పరీక్షించి రక్త పరీక్షల నమూనాలకు రాస్తున్నారు. డయాగ్నస్టిక్‌ టీ`హబ్‌లో ఉచిత రక్త నమూనాలు స్వీకరించి రోగ నిర్ధారణ పరీక్ష చేసే యంత్రాలు పనిచేయక పోవడంతో, అత్యవసర పరిస్థితుల్లో ప్రయివేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు రోగులు. నిరుపేద రోగులైతే టెస్టులకు నోచుకోలేక పోతున్నారు. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారు. ఒక కరీంనగర్‌ జనరల్‌ పరిస్థితితో పాటు ఇతర పాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
పనిచేయని డయగ్నస్టిక్‌ యంత్రాలు..
కరీంనగర్‌ ప్రభుత్వ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ లోని యంత్రాలు ఈ నెల 26 నుండి పని చేయడం లేదు. అత్యధిక రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేసే బయో కెమిస్ట్రీ మిషన్‌తో పాటు సీబీపీ, థైరాడ్‌, ఇతర రక్త పరీక్షలు చేసే యంత్రాలు మొరాయించాయి. దీంతో కరీంనగర్‌ జిల్లాలోని 29 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 134 రకాల రోగ నిర్ధారణ పరీక్షల్లో అతి ముఖ్యమైన రక్త పరీక్షలు జరగని పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల ఒక్కో రోగి సుమారు రూ. 5 వేల నుండి రూ. 10 వేల వరకు నష్టపోతున్నాడు. సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తుండంతో రోగికి తప్పనిసరిగా సీబీపీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్లేట్‌లెట్స్‌ ఇతర పలు సమస్యలు డాక్టరుకు తెలిసే అవకాశాలుంటాయి. దీంతో రిపోర్టుకు తగ్గట్టు డాక్టర్‌ చికిత్స చేసే అవకాశాలుంటాయి. తెలంగాణ టీ`హబ్‌లో ఈ యంత్రం కూడా పనిచేయడం లేదు.
ఇంజనీర్‌ లేక పోవడం వల్లేనే ఈ పరిస్థితులు..
2021లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుమారు 2.50 కోట్లతో డయాగ్నస్టిక్‌ హబ్‌ యంత్రాలను కొనుగోలు చేసి, కరీంనగర్‌లో ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పదం మేరకు నిర్ణీత గడువులో మాత్రమే యంత్రాలకు ఇంజనీర్‌చే మరమ్మతులు చేయిస్తారు కంపెనీ యాజమాన్యాలు. ప్రస్తుతం ఈ యంత్రాల వారెంటీ ముగిసినట్లు తెలుస్తుంది. దీంతో అధికారుల ఫిర్యాదులకు సదరు ఇంజనీర్‌ స్పందించడం లేదు. వైద్యశాఖలో అనేక మంది అధికారులు మారారు. ప్రస్తుతమున్న ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి డయగ్నస్టిక్‌ యంత్రాల వారెంటీ, మరమ్మతులపై అవగాహన లేక పోవడం వల్ల రోజుల తరబడిగా యంత్రాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. వైద్యశాఖలో సబంధిత ఇంజనీర్లు లేక పోవడం వల్లే ఇతరులపై ఆధార పడాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక డయాగ్నస్టిక్‌ హబ్‌లు ఉన్నందున, ప్రభుత్వమే ఇంజనీర్లను నియామకం చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలే ఉండవని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page