ఎన్నికల వరకే రాజకీయాలు..ఆ తరువాత అభివృద్ధి
జడ్పీటీసీల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి పొన్నం
పోతారంలో గురుకుల పాఠశాల తనిఖీ
ఎల్కతుర్తి/ బీమదేవరపల్లి-జనత న్యూస్
గౌరవెల్లి, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా బీమదేవర పల్లి, ఎల్కతుర్తి మండల పరిషత్ కార్యాలయాల్లో జడ్పీటీసీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు ఆయన హాజరై మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని, సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. హుస్మాబాద్‌లో మెగా జాబ్ మేళా ద్వారా 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సేవ చేసే వారికి మళ్లీ అవకాశాలు వస్తాయన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తరువాత అభివృద్ధియే లక్ష్యంగా పని చేస్తానన్నారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రజా ప్రతినిధులను ఆయన సత్కరించారు. అనంతరం వన మహోత్సవం లో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో మొక్కలు నాటారు. నియోజకవర్గంలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుదీర్ కుమార్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల తనిఖీ
హుస్నాబాద్ నియోజక వర్గంలోని పోతారంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను సందర్శించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా చిన్నారులతో ఆత్మీయంగా మాట్లాడారు. పాఠశాలలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. మధ్యాహ్నం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. పేరెంట్స్‌కు వీడియో కాల్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్‌లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుక రావాలని సూచించారు. విద్యార్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు మంత్రి పొన్నం. స్కూల్ గ్రౌండ్ విషయమై మంత్రి దృష్టికి తీసుక రాగా.. స్థల పరిశీలన చేసి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూల్‌కు విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని ఆవరణలో లైట్స్ ఏర్పాటు చేయాలని, నాణ్యమైన డ్రిరకింగ్ వాటర్ అందించాలని తెలిపారు. ప్రహరీ గోడ పై నుండి కుక్కులు వస్తుండడం తో దానికి పెన్సింగ్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.