- డైనమిక్ లీడర్ గుర్తింపు..
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రొఫైల్
హైదరాబాద్, జనతా న్యూస్:ఉమ్మడి నల్లగొండ జిల్లా మా అడ్డా.. అన్ని సీట్లనూ క్లీన్ స్వీప్ చేస్తాం.. మిగిలిన జిల్లాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేసి.. కాంగ్రెస్‌ను గెలిపించాలి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన ఈ మాటను నిలబెట్టుకున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండలోని 12 స్థానాలకు 11 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించారు కూడా. అధిష్టానం వద్ద కొట్లాడి.. తన వాళ్లకే టికెట్లు ఇప్పించుకున్న వెంకట్‌రెడ్డి.. వాళ్లందరినీ గెలిపించుకొని జిల్లాలో తన పట్టును నిరూపించుకున్నారు. సూర్యాపేటలో మాత్రం కాంగ్రెస్ బోల్తా పడింది. బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఓడిపోయారు. మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయడం వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ శ్రమ ఉందంటున్నారు ఆ పార్టీ నాయకులు. అన్ని నియోజక వర్గాల్లోనూ తామే పోటీ చేసినట్లు ఫీలైన డైనమిక్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్‌గా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. భారమంతా ఆ బ్రదర్స్‌పైనే వదిలేసిన రేవంత్ రెడ్డి సైతం నల్లగొండ జిల్లా ప్రచారంలో చివరి మూడు రోజులే పాల్గొన్నారు. ఇప్పుడు రేవంత్ కేబినెట్‌లో కీలక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఎన్‌ఎస్‌యూఐలో చురుకైన పాత్ర
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో 1963 మే 23వ తేదీన జన్మించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పాపిరెడ్డి, సుశీలమ్మ దంపతుల తొమ్మిది మంది సంతానంలో వెంకట్‌రెడ్డి 8వ వాడు. సీబీఐటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివిన వెంకట్ రెడ్డి విద్యార్థి దశలోనే ఎన్‌ఎస్‌యూఐలో చురుకైన పాత్ర పోషించారు. వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ తరఫున 1999లో, 2004లో, 2009లో, 2014లో వరుసగా నాలుగుసార్లు గెలిపించిన నల్లగొండ ప్రజలు 2018లో మాత్రం షాకిచ్చారు. దీంతో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలిచి జిల్లాపై తన పట్టును నిలుపుకున్నారు. వైఎస్సార్, రోశయ్య కేబినెట్లలో సమాచార సాంకేతిక, ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మౌలిక వసతులు, పెట్టుబడులు, రేవుల శాఖ మంత్రిగా పని చేసిన వెంకట్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011లో మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణపై మక్కువను చాటుకున్నారు. వెంకట్‌రెడ్డిని నల్లగొండ ప్రజలు ఇప్పుడు ఐదోసారి గెలిపించి అసెంబ్లీకి పంపించారు.
ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు
కాంగ్రెస్ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన వెంకట్‌రెడ్డి.. పార్టీలో ఎవరినీ లెక్కచేయరనే అపవాదును మూట గట్టుకున్నారు. దుందుడుకు స్వభావాన్ని వీడాలని ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయనకు 2018లో రెండుసార్లు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అయినా తగ్గకపోవడంతో అదే ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. తర్వాత సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో 2011 నవంబర్ ఒకటో తేదీన తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడం తెలంగాణ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో ఒకసారి, 2011లో మరోసారి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించలేదు.
సామాజిక కార్యక్రమాల్లో..
సామాజిక కార్యక్రమాల్లోనూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందుంటారు. 2011 డిసెంబర్ 20వ తేదీన ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదంలో చనిపోయిన తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా నల్లగొండలో ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బాలికల కోసం ఒకేషనల్ జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో అంబులెన్స్ సేవలు కూడా నిర్వహిస్తున్నారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ మేళాలు నిర్వహిస్తూ తెలంగాణలోని వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అందుకే నల్లగొండ జిల్లా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు.
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 సీట్లలో కాంగ్రెస్ గెలుపు
- మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో దామోదర్ రెడ్డి ఓటమి
- నార్కట్‌పల్లిలోని బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో పుట్టిన వెంకట్‌రెడ్డి
- 1963 మే 23న జన్మించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- నల్లగొండ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
- 2019లో భువనగిరి నుంచి ఎంపీగా గెలుపు
- 2011లో మంత్రి పదవికి వెంకట్ రెడ్డి రాజీనామా
- పార్టీలో ఎవరినీ లెక్క చేయని వెంకట్‌రెడ్డి
- 2018లో షోకాజ్ నోటీసు.. సస్పెన్షన్
- 2011లో 9 రోజుల పాటు నిరాహార దీక్ష
- 2010, 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా
- 2011 డిసెంబర్ 20న చనిపోయిన కుమారుడు
- ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతీక్ ఫౌండేషన్ స్థాపన