-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే..
-
అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
(యాంసాని శివకుమార్ -ఎడిటర్)
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా.. లేదా.. అన్నదే లెక్క.. ఓ సినిమాలోని ఈ డైలాగ్ రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. రాజకీయాల్లోకి లేటుగా వచ్చినా.. లేటెస్టుగా తెలంగాణ సీఎం అయ్యే చాన్స్ కొట్టేశారు రేవంత్. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ విజయం సాధించిందనడం కంటే.. కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని రేవంత్ ఎనిమిదేళ్ల క్రితం కన్నీటితో చేసిన శపథం నెగ్గిందనే చెప్పొచ్చు. కాంగ్రెస్‌లో మహామహులను కాదని.. తెలంగాణ సీఎం పీఠం రేవంత్ కోసం ఎదురు చూడటం ఆయన అవిశ్రాంతంగా పడిన కష్టానికి దక్కిన ఫలితంగా చెప్పుకోవచ్చు. కనీసం మంత్రి పదవిని సైతం అధిరోహించకుండా 16 ఏళ్ల అతి స్వల్ప రాజకీయ జీవితంలోనే ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు.
16 రోజులు నిద్రలేని రాత్రులు
చర్లపల్లి జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. ఉగ్రవాదులను బంధించే డిటెన్షన్ సెల్‌లో నన్ను ఉంచినప్పుడే.. కేసీఆర్‌ను గద్దె దించాలని శపథం పూనా.. దాని కోసం ఎంతవరకైనా పోరాడుతా.. ఎవ్వరికీ భయపడేది లేదు.. నిటారుగా నిలబడి కొట్లాడుతా.. ఈ పోరాటంలో నా ఆస్తులు అమ్ముకోవడానికైనా వెనుకాడను. చివరికి ఒంటి మీద బట్టలు లేకున్నా కేసీఆర్‌ను ఓడించే వరకూ నిద్రపోను. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లి.. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత రేవంత్ చేసిన సవాల్ ఇది. ఆయన శపథం ఎనిమిదేళ్లకు నెరవేరింది. కాంగ్రెస్ అనే అస్త్రంతో బీఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికల్లో ఓడించి.. తన శపథాన్ని నెరవేర్చుకున్నారు రేవంత్. అసలు ఇంతకూ.. రేవంత్ రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు.. ఎలా వచ్చారు..
రేవంత్ రాజకీయ ప్రస్థానం.
రేవంత్ రెడ్డి.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8వ తేదీన జన్మించారు. తండ్రి అనుముల నర్సింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ దంపతులకు పుట్టిన రేవంత్.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాలేజీలో ఉన్నప్పుడే ఏబీవీపీలో చేరి.. విద్యార్థి నాయకుడిగా రాణించారు. అనంతరం జాగృతి అనే వార పత్రికలో జర్నలిస్ట్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం తర్వాత ఆయన తన దృష్టిని రాజకీయాల వైపు మళ్లించారు. తన కుటుంబానికి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినప్పటికీ, రాజకీయాల్లో రాణించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే తడవుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి..
2007లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా గెలిచారు. అప్పుడే రేవంత్‌లో నాయకత్వ లక్షణాలు బయట పడ్డాయి. తర్వాత ఎమ్మెల్సీగానూ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడంతో రేవంత్‌పై అన్ని పార్టీల దృష్టి పడింది. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినా.. ఎన్టీఆర్, చంద్రబాబులపై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు.2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రావులపల్లి గుర్నాథ్ రెడ్డిపై విజయ ఢంకా మోగించారు. 2014లోనూ టీడీపీ తరఫున రెండోసారి ఘన విజయం సాధించారు. 2015లో ఓ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారు. జైలుకు సైతం వెళ్లిన రేవంత్ 16 రోజుల తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. 2017 వరకు టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అయితే.. 2018 ఎన్నికల్లో కొడంగల్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్.. 2019లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు
2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రేవంత్ రాజకీయ జీవితమే మారిపోయింది. కేసీఆర్‌ను ఓడించాలన్న వ్యక్తిగత కసికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అండ తోడైంది. కేసీఆర్ ఎత్తుగడలతో పదేళ్లలో రాష్ట్రంలో నిర్వీర్యమైన కాంగ్రెస్‌కు మళ్లీ జవసత్వాలు అందించారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూనే పార్టీలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి రాష్ట్ర కాంగ్రెస్ ఉద్ధండులను పక్కనబెట్టి.. ఒంటరి పోరుతో కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఇప్పుడు తెలంగాణ సీఎంగా రేవంత్‌ను కాంగ్రెస్ సీనియర్లు సైతం వ్యతిరేకించలేని స్థాయికి చేరుకున్నారు. ఢిల్లీ అధిష్టానం సైతం రేవంత్ పట్టుదల, కృషిని మెచ్చుకుని సీఎంగా పట్టం కట్టింది.