కరీంనగర్‌లో భారీ ఏర్పాట్లు
మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంట కెనాల్..
మూడు ప్రాంతాల్లో క్రేన్స్, లైటింగ్స్, బారీకేట్లు
టవర్ సర్కిల్ వద్ద ప్రత్యేక పూజలు
జిల్లా వ్యాప్తంగా 2931 ప్రతిమలకు జీయో ట్యాగింగ్
సీపీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో బందోబస్తు
కరీంనగర్-జనత న్యూస్
తొమ్మిది రాత్రులు పూజలందుకున్న ఘన నాథుడు కొద్ది గంటల్లో నిమజ్జనం కానున్నాడు. అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించే శోభాయాత్ర, నిమజ్జన వేడులకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో సమారు మూడు వేల వరకు ప్రతిమలు ఏర్పాటు చేయగా..2931 గణ నాథుల విగ్రహాలకు జీయో ట్యాగింగ్ చేశారు. ప్రధానంగా నగరంలోని 513 గణ నాథుల్లో 8 అడుగులకు పైగా ఉన్న 418 విగ్రహాలకు మానకొండూర్, కొత్తపల్లి చెరువులతో పాటు చింతకుంట కెనాల్‌లో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సోమవారం ఏడు గంటల నుండిన నిమజ్జనం ప్రారంభమై తెల్లవారు వరకు నిర్వహించే అవకాశాలున్నాయి.
కరీంనగర్ జిల్లాలో సోమవారం నిర్వహించే గణేశ్ నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయనున్నారు. నగరంలోని ఆయా డివిజన్లలో సుమారు ఆరు వందల వకు విగ్రహాలుండగా..ఇందులో 513 ప్రతిమలకు పోలీసులు జీయో ట్యాగింగ్ చేశారు. ఇందులో ఎక్కువ శాతం గణేశ్ ప్రతిమలు మానకొండూర్ చెరువులో నిమజ్జనం చేయనున్నారు. ఇక్కడ మూడు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. కొత్తపల్లి, చింతకుంట కెనాల్ ప్రాంతాల్లోనూ క్రేన్లతో పాటు గజ ఈతగాళ్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా సీపీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో డీసీపీ, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐల పర్యవేక్షణలో పోలీసులు విధులు నిర్వహించనున్నారు. శోభాయాత్రలో ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరగకుండా జీయో ట్యాంగింగ్ ద్వారా నియంత్రించేలా పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
టవర్ సర్కిల్ వద్ద ప్రత్యేక పూజలు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆయా ప్రాంతాల నుండి టవర్ సర్కిల్ వరకు శోభాయాత్రగా వచ్చి ప్రత్యేక పూజలు జరుపడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం టవర్ సర్కిల్ వద్ద మంత్రి, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశాక, అక్కడి నుండి వరుస క్రమంలో మానకొండూర్ చెరువు వద్దకు వెళ్తుంటాయి. టవర్ సర్కిల్ వద్ద విశ్వ హిందు పరిషత్, భజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పార్టీలకు అతీతంగా వేడుకలు నిర్వహించుకుంటారు. తెలంగాణ చౌరస్తా, సుభాష్ నగర్, బొమ్మకల్ చౌరస్తా, తదితర ప్రాంతాల నుండి టవర్ సర్కిల్ వరకు గణేశ్ విగ్రహాలు చేరుకునేలా రోడ్ మ్యాప్‌ను రూపొందించారు అధికారులు.
డీజేలు, టపాసులు నిషేదం
వేడుకల్లో టపాసులు పేల్చడం, డీజే సౌండ్స్‌ను నిషేదించింది పోలీసు శాఖ. నిమజ్జన ప్రాంతాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు .కమాన్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, కోర్టు చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమారాల ద్వారా శోభాయాత్రను పర్యవేక్షనున్నారు. నగరంలోని అన్ని చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన మైక్‌ల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు, రోడ్‌మ్యాన్‌ను భక్తులకు తెలుపుతారు. నగరంలో ఐదుగురు ఏసీపీలు, 12 మంది ఇన్స్‌పెక్టర్లు, 20 మంది ఎస్‌ఐలు, సుమారు 600 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.