మరోమారు బిఆర్‌ఎస్‌దే విజయం?
కరీంనగర్ (జనతా న్యూస్): అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వస్తున్న ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యే విధంగా ఆదివారం జరిగే లెక్కింపులో ప్రజల తీర్పు బట్టబయలు అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజం కావని గతంలో అనేక సందర్భాల్లో రుజువు అయ్యిందన్నారు. కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయని, ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నాయని, అయినా ప్రజలు నమ్మడం లేదని అన్నారు. మంచి విద్య, ఉన్నత వైద్యం, నిరంతర సాగు, తాగునీరు, 24 గంటల విద్యుత్ సరఫరా ఇలా అనేక రంగాల్లో దేశంలో తెలంగాణను కేసీఆర్ మొదటి స్ధానంలో నిలిపారన్నారు. ఇవే తెలంగాణలో కెసిఆర్‌ను ఆదరిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలనే విధంగానే ఓటింగ్ సరళి కొనసాగిందన్నారు. ప్రజలు ఎంతో చైతన్యవంతులని, బీఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి తేవాలనే సంకల్పంతో ఈ సారి సైలంట్‌గా తీర్పు ఇచ్చారని అన్నారు. రాష్టాన్రికి ఎలాంటి నాయకుడు అవసరమో? ఎలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో అన్నది ప్రజలు గుర్తించారని, అదే క్రమంలో ఓటింగ్ సరళి ఉందన్నారు. లోతుగా ప్రజలు ఆలోచన చేసి ఓటు వేశారన్నారు.