Thursday, September 19, 2024

అంతా రహస్యమే !

కానరాని ఎఫ్‌ఎస్‌ఓ, జీఎఫ్‌ఐ
తనిఖీలసలే ఉండవు..
గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ల జారీ
ఫుడ్‌ స్టేఫ్టీ ఆఫీసుపై..
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

కరీంనగర్‌-జనత ప్రతినిధి

మార్కెట్లో తినే వస్తువులు, పదార్థాలు..కల్తీయా, క్వాలిటీయా..అనేది తెలియని పరిస్థితి. విచ్చలవిడిగా కల్తీ, నాసిరకం అహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు అనేక సందర్భాల్లో చూశాం. కల్తీలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కల్తీ ఉత్పత్తులను నిగ్గుతేల్చి, వినియోగ దారులకు నాణ్యమైన పదార్థాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లపై ఉంది. కాని..కరీంనగర్‌ జిల్లాలో సీన్‌ రివర్స్‌. ఇక్కడ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసు ఎక్కడుందో తెలియదు. ఆఫీసర్లెవరో తెలియదు. షాపులు, ఉత్పత్తి సంస్థల నిర్వాహకులకు రిజిస్ట్రేషన్‌, లైసెన్సుల జారీ..ఇలా అన్నీఇక్కడ రహస్యాలే. ఫుడ్‌ సేఫ్టీ కార్యాలయ నిర్వహణపై కొద్ది మందికి అవగాహన ఉన్నా..తెలుసుకుని ఆఫీసుకు వెళ్లినా..చిక్కరూ, దొరకరు అన్నట్లుగా ఆఫీసర్లెవరూ అందుబాటులో ఉండరు.ఉన్నతాధికారులు ఫోకస్‌ చేయక పోవడం, పర్యవేక్షించక పోవడమే..ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసు అస్తవ్యస్తానికి కారణంగా తెలుస్తుంది.

కరీంనగర్‌ ప్రభుత్వ మాత, శిశు ఆసుపత్రి పక్కనే గెజిటెడ్‌ ఫుడ్‌ ఆఫీసు కార్యాలయం ఉంది. అహార పదార్థాల తయారీ, సరుకుల అమ్మకాలు చేసే దుకాణాలు, ఉత్పత్తి కంపెనీలు, సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్స్‌..ఇలా అన్నింటిపై ఈ కార్యలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతే కాదు..నిరంతరం తనిఖీలూ నిర్వహిస్తూ..ప్రజలకు నాణ్యమైన అహారం అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇందులో గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌, ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌తో పాటు సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది. కాని ఇందులోని ప్రధాన అధికారులిద్దరూ ఇంఛార్జీలే. గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌గా నాయక్‌, ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌గా సునిత ఉన్నారు. ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ సునిత కామారెడ్డితో పాటు కరీంనగర్‌లోనూ విధులు నిర్వహిస్తు ఉండడంతో..ఏ రోజు ఎక్కడ ఉంటున్నారో ఎవరీకీ తెలియడం లేదు. వారంలో కనీసం రెండు రోజులైనా కరీంనగర్‌ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని పలువురు వాపోతున్నారు.
చిక్కరూ దొరకరు ?
కరీంనగర్‌ ఇంఛార్జి గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ నాయక్‌, ఇంఛార్జి ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెల్తారో తెలియదు. ఎప్పుడెళ్లినా కామారెడ్డిలోనో, మరెక్కడో ఉందని సాకులు చెబుతుంటారు పార్టైం సిబ్బంది. కనీసం వారానికి ఒక రోజు కూడా కరీంనగర్‌ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసులో వారు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలున్నాయి. దీంతో కల్తీలపై వచ్చిన ఫిర్యాదులకు చర్యలు తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వాపోతున్నారు. కరీంనగర్‌ జిల్లాలో వేలాదిగా దుకాణాలు, హోటళ్లు, బేకరీలు..అహార ఉత్పత్తి సంస్థలున్నప్పటికీ తనిఖీలు మాత్రం శూన్యం. జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్లలోనూ నాసిరకం పదార్థాల ద్వారా విద్యార్థులు అస్వస్తతకు దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. వాటిపై తనిఖీలు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు ఆఫీసు ఎదుట ఆందోళనలు చేసిన సందర్భాలూ ఉన్నాయి.
రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ల జారీ రహస్యమే !
షాపు విలువ అధారితరంగా గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌, లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్లో నమోదు చేసి, క్షేత్ర స్థాయిలో ఫుడ్‌ఇన్స్‌పెక్టర్‌ పరిశీలించి, నాణ్యమైన ఉత్పత్తులుగా నిర్ధారించాకే, కొన్ని షరుతుల మేరకు లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంటుంది. కరీంనగర్‌ జిల్లాలో ఇవేమీ చూడడం లేదనే విమర్శలున్నాయి. అనేక మంది దొడ్డిదారిన లైసెన్స్‌లు తీసుకుని, కల్తీల పదార్థాలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఆరోపనలున్నాయి.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసుపై ఆ శాఖ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణ లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం నెలకోసారైనా జాయింట్‌ కలెక్టర్‌ సమీక్ష చేసి కల్తీలపై ఫైన్‌గాని, ఇతరచర్యలు తీసుకునే వారు. ప్రస్తుతం ఇవేమీ చేయక పోవడం వల్ల వినియోగ దారులకు నాణ్యమైన అహార పదార్థాలు, సరుకులు అందడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అత్యంత ప్రాధాన్యత గల ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసుపై దృష్టి సారిస్తారా..లేక ఆలానే వదిలేస్తారా..అనేది వేచి చూడాలి.
ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లపై అనేక ఫిర్యాదులు చేశాం
బోనగిరి మహేందర్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు
సమస్యలు చెప్పేందుకు, ఫిర్యాదు చేసేందుకు కరీంనగర్‌ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసుకు ఎప్పులెల్లినా తాళం వేసి ఉంటుంది. అధికారులెవరూ అందుబాటులో ఉండరు. గతంలో ఈ ఆఫీసు ఎదుట నిరసన కూడా చేశాం. అహార పదార్థాలు, సరుకుల నాణ్యత తెలుసుకునేందుకు నిరంతరం తనిఖీలు చేయాల్సిన అధికారులు ..ఇలా అడ్రల్‌ లేకుండా పోవడం వల్ల వినియోగ దారులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కల్తీల వల్ల ప్రజలు అనారోగ్య భారిన పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ వీరిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page