తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులు
మూడేళ్లలో 700 మంది ఉపాధి : మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ :
అమెరికా టెలికమ్యూనికేషన్ల సంస్థ మైక్రోలింక్ నెట్ వర్క్స్ రాష్ట్రంలో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్ కు చెందిన పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్ ను ప్రారంభించనుంది. ఈ మేరకు సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు తో…మైక్రోలింక్, పీఎస్‌ఆర్ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. వచ్చే మూడేళ్లలో రూ. 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రానిక్, ఐటీ, నిర్మాణరంగ పరికరాలను ఉత్పత్తి చేస్తుందని శ్రీధర్ బాబు వివరించారు. మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. ఇటీవల తన అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలవంతం అయినట్లు చెప్పారు. డేటా ట్రాన్స్ మిషన్, నెట్ వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో ‘‘మైక్రోలింక్ నెట్ వర్క్స్’’…గ్లోబల్ లీడర్ గా ఉందన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరతలేదని కంపెనీ ప్రతినిధులకు శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు, మైక్రోటెక్ గ్లోబల్ ప్రతినిధులు డెనిస్ మొటావా, సియాన్ ఫిలిప్స్ పాల్గొన్నారు.