అధికారులకు సీపీ అభిషేక్ మొహంతి సూచన
కరీంనగర్,జనత న్యూస్: ఎన్నికల్లో పోలీస్ అధికారులు విధులు పారదర్శకంగా నిర్వహించాలని సీపీ అభిషేక్ మొహంతి తెలిపారు శుక్రవారం కరీంనగర్ లోని రాంనగర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల, కరీంనగర్ బైపాస్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ యందు ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు ఎన్నికల్లో నిర్వహించు విధులపై కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి పలు కీలక సూచనలు చేసారు. ఎన్నికలరోజు ముందు రోజు ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామాగ్రిని, ఈవీఎంలను స్వీకరించిన తరువాత వాటికి భద్రతగా కేటాయించిన పోలింగ్ లొకేషన్ , కేంద్రాన్ని తెలుసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటి నుండి ఎన్నికలు ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని సూచించారు. పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్ణయించబడినప్పటికీ పోలింగ్ రోజున ఉదయం 06 గంటలకే విధులకు హాజరై సంసింద్దంగా ఉండాలన్నారు. పోలింగ్ రోజున ఓటర్లను క్యూ పద్దతిలో ఉండేలా చూసుకోవాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలు,వృద్ధులతోపాటు అన్ని వర్గాల ప్రజలతో సత్ప్రవర్తనతో మెదలాలని ప్రత్యేకంగా సూచించారు.ఏదైనా పోలింగ్ కేంద్రం వద్ద శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి వాటిని నివారించేందుకు రూట్ ఆఫీసర్,స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులను కేటాయించామని ఆయా అధికారుల ఫోన్ నంబర్లను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని,సమస్యలు తలెత్తితే వెంటనే తెలపాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారి అనుమతి లేనిదే ఎట్టిపరిస్థితుల్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లరాదని, వారు పిలిస్తేనే వెళ్లాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుంటూ ఎన్నికలు ప్రశాంతగా ముగిసేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రినిసిపాల్ శ్రీనివాస్ తో పాటు కమిషనరేట్ పోలీస్ సెంటర్ ప్రిన్సిపల్ ఏ లక్ష్మినారాయణ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.