Tuesday, July 1, 2025

సంపాదనకే.. పాశ్చాత్య పోకడ

ఉష్ణ మండల ప్రాంతంలో బ్లేజర్లు?
. విద్యార్థులకు శాపంగా మారిన వైనం
– యూనిఫాంలోను కమీషనే!
– ప్రయివేటు స్కూళ్లలో యేటా రూ. 40 కోట్లకు పైగానే వ్యాపారం

కరీంనగర్‌-జనత న్యూస్‌

మన సనాతన విద్యా విధానం గురుకుల్లాల్లో చెట్ల క్రింద కొనసాగింది.ఎలాంటి లాభ పేక్షణ లేకుండా విద్య పైననే విద్యార్థి కేంద్రీకృతంగా విద్యాభ్యాసనా జరిగేది. మన ప్రాంత వాతావరణ పరిస్థితులకంగుణంగా వస్త్ర ధారణ ఉండేది. కానీ ప్రస్తుతం విద్యా వ్యవస్థ గాడి తప్పింది. ధనార్జనే ధ్యేయంగా చదువులను కొనాల్సిన పరిస్థితులు దాపురించాయి.ఉష్ణ మండలంలో ఉన్న మనకు వదులుగా ఉండే దుస్తులకు బదులుగా బిగుతుగా ఉండే దుస్తులను పాశ్యాత్య పోకడలకు పోతూ మన సంస్కృతిని విద్యా వ్యవస్థను పక్క దోవ పట్టిస్తున్నారు.దీని ప్రభావం విద్యార్థుల మానసిక , శారీరక ఎదుగుదలలో తద్వారా వారి చదువులను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

‘‘ ప్రయివేటు స్కూళ్లో మీ పిల్లోడిని జాయిన్‌ చేయించావా..? ఫీజు, బుక్స్‌తో పాటు యూనిఫాంకు కనీసం రూ.7 వేలు దగ్గరుంచుకో ! తెలిసిన షాఫులో క్లాత్‌ తీసుకుని తక్కువ రేట్లలో క్వాలిటీగా కుట్టించుకుంటా నంటే కుదరదు. యాజమాన్యం చెప్పిన షాపులో, వారు చెప్పిన ధరకు కొనాల్సిందే !!’ ఇదీ ప్రయివేటు, కార్పోరేట్‌ పాఠశాలల్లో జరుగుతోన్న తీరు.

స్కూల్‌కో కలర్‌, స్టైల్‌తో యూనిఫాం లను నిర్ణయించుకుంటున్నాయి యాజమాన్యాలు. కరీంనగర్‌ జిల్లాలోని సుమారు 300 ప్రయివేటు, కార్పోరేట్‌ స్కూళ్లలో వివిధ రకాల రంగుల్లో యూనిఫాంలు తయారు చేయిస్తూన్నాయి. నగరంలోని ప్రధానంగా నాలుగు షాపులు ఏటా రూ. 40 కోట్ల వరకు టర్నవర్‌ చేస్తున్నాయి. ఇందులో సుమారు 15 కోట్లకు తగ్గకుండా ప్రయివేటు స్కూల్‌ యాజమాన్యాలు కమీషన్‌ రూపంలో దండుకుంటున్నట్లు సమాచారం. అటు షాప్‌ ఓనర్స్‌, ఇటు స్కూల్‌ యాజమాన్యాలకు లాభసాటి వ్యాపారంగా మారింది. సంవత్సరం మొత్తం కాకుండా, మూడు మాసాల్లోనే 90 శాతం ఈ వ్యాపారం కొనసాగుతుంది. స్కూల్‌ యూనిఫాం రూపంలో పేరెంట్స్‌ నుండి నేరుగా వసూలు చేయకుండా, షాప్‌ ఓనర్స్‌ నుండి కమీషన్‌ రూపంలో స్కూల్‌ యాజమాన్యాలు లాభాలు ఆర్జిస్తున్నాయి.
స్టూడెంట్‌ స్కూల్‌లో జాయిన్‌ కాగానే యూనిఫాం కోసం స్లిప్‌ రాసిస్తారు స్కూల్‌ సిబ్బంది. పేరెంట్స్‌ ఆ స్లిప్‌ తీసుకెళ్లి షాప్‌లో చూపిస్తే ఆ సైజ్‌ యూనిఫాం ఇస్తాడు. వారు చెప్పిన ధర చెల్లించి తీసుకుని రావాల్సిందే. ఇందులో బేరసారాలు ఏమాత్రం ఉండవు. ఆయా స్కూల్‌ను బట్టి ఒక్కో విద్యార్థి రూ. 3 వేల నుండి రూ. 8 వేల వరకు యూనిఫాంల రూపంలో చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇలా తల్లిదండ్రుల వద్ద నుండి పరోక్షంగా యాజమాన్యాలు వసూలు చేస్తున్నట్లు స్ఫష్టమౌతుంది. వీటిపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం విశేషం.

బ్లెజర్స్‌తో అనారోగ్య సమస్యలు ?
ప్రయివేటు, కార్పోరేట్‌ స్కూళ్లలో విద్యార్థులు బ్లేజర్లు వేసుకోవడం అనారోగ్య సమస్యలూ తలెత్తే అవకాశాలున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు వీటిని ధరించడం వల్ల వల్ల ఉక్కపోత, శరీరానికి గాలి తగలక పోవడం వల్ల చర్మసంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్లు పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు షూస్‌, బ్లేజర్‌ ధరించి ఉండడం వల్ల చిన్నారులు శారీరక ఎదుగుదల కూడా లోపించే అవకాశాలుంటాయి. ప్రయివేటు, కార్పోరేట్‌ సంస్థలు తమ బ్రాండ్‌ ఇమేజ్‌, స్వలాభం కోసం వెస్టెర్న్‌ కల్చర్స్‌ను ఉష్ణ ప్రాంతమైన మనపై రుద్దుతున్నాయి.
ప్రయివేటు విద్యా సంస్థల్లోని యూనిఫాం డిజైన్స్‌, ధరల నిర్ణయంపై విద్యాధికారి ఛైర్మన్‌ గల కమిటీ వేసి నిర్ణయించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు నష్టం కలిగించేలా ఇష్టారాజ్యంగా ప్రయివేటు యాజమాన్యాలు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలకు కల్లెం వేయాల్సిన వసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page