-ఇక మంథనిపైనే శ్రీధర్ బాబు నజర్
-మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో..
-నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్
-క్యాడర్ ను మరింత స్ట్రెంథెన్ చేసుకునేలా సమాలోచనలు
-విపక్ష,రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు తావ్వొద్దనే భావన
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ బాబు ఇప్పుడు తన స్వంత నియోజకవర్గం మంథనిపై నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. 2018లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పైస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడంతో శ్రీధర్ బాబు కొంత ఇబ్బందిగా ఫీలయ్యారు. కానీ,ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన దూద్దిళ్ల పరిశ్రమలు, ఐటీ,శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మంథనిని అభివృద్ధి చేయడంతో పాటు..తన క్యాడర్ ను మరింత స్ట్రెంథెన్ చేసుకోవాలనే ఆలోచనలో శ్రీధర్ బాబు ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే నియోజకవర్గంలో పెండింగ్ పనులపై దూద్దిళ్ల ఇప్పటికే ప్రత్యేక నజర్ పెట్టినట్లు సమాచారం. అలాగే సెగ్మెంట్ లోని బీఆర్ఎస్,విపక్ష పార్టీలను మరింత బలహీన పరిచేందుకు స్కెచ్ లు కూడా గీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు కూడా శ్రీధర్ బాబుకు పుష్కలంగానే ఉన్నాయి. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో పార్టీ తరపున ఏఐసీసీ కార్యదర్శిగా పని చేసి దూద్దిళ్ల హస్తిన పెద్దల దగ్గర మంచి పేరును కొట్టేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పవర్ లోకి రావడానికి కూడా తన వంతు పాత్రను పోషించారు. తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఛైర్మెన్ గా కూడా పనిచేయడం ఆయనకు ఈసారి కలిసోచ్చింది. అంతేకాక పాత తరం కాంగ్రెస్ నాయకుడిగా జాతీయ,రాష్ట్ర స్థాయిలో శ్రీధర్ బాబుకు విశేషమైన గుర్తింపు ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన అనుకున్న పనిని చేయగల్గే స్థాయి నేతగా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే తాను మంత్రిగా ఉన్న పీరియడ్ లోనే అత్యధిక నిధులను తన నియోజకవర్గమైన మంథనికి తీసుకురాగల్గినట్లైతే తన మార్క్ అభివృద్ధితో పాటు బీఆర్ఎస్ ను మరింతగా బలహీనపరచినట్లవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే ఇక నుంచి దూద్దిళ్ల నియోజకవర్గంలో వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. మంథని సెగ్మెంట్ లోని 9 మండలాలను వరుసగా చుట్టేసేలా పర్యటనలను పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయా మండలాల్లో గతంలో తాను ఎమ్మెల్యేగా చేయలేని పెండింగ్ డెవలప్ మెంట్ వర్క్స్ ను పూర్తి చేసే అంశాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. అప్పటి పనులన్నింటికి ఇప్పుడు తాను మంత్రిగా ఉన్నందున అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు తాను మంత్రిగా ఉన్నందున క్యాడర్ అక్కడక్కడ కొంత దూకుడు స్వభావాన్ని ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అలాంటి ఘటనలపై కూడా కొంత నజర్ పెట్టాలనే భావనలో దూద్దిళ్ల ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారుల వద్ద క్యాడర్ దురుసుగా ప్రవర్తించకుండా.. వారికి అవసరమైన పనులను సాఫీగా పూర్తి చేసుకోవాలని వారికి ఇప్పటికే సూచించినట్లు సమాచారం. మొత్తంగా అటు మంథని లో ఒకవైపు డెవలప్ మెంట్ వర్క్స్ పై ఫోకస్ చేస్తూనే..మరోవైపు తన క్యాడర్ కూడా పార్టీకి,తనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరచకుండా జాగ్రత్తగా వ్యవహరించేలా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది