ముస్తాబైన మహాశక్తి దేవాలయం
అక్టోబర్ 3 నుండి 12 వరకు వేడుకలు
భవనీ దీక్ష స్వాములతో కళ కళలాడుతున్న క్షేత్రం
9న పల్లకిసేవ, 10 సద్దుల బతుకమ్మ, 12న విజయ దశమి
రోజూ రాత్రి 9 నుండి దాండియా ఆటా`పాట
కరీంనగర్-జనత న్యూస్
దసరా ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబౌతున్నాయి. ప్రతీ యేటా లానే ఈ సంవత్సరం కరీంనగర్ లోని మహాలక్ష్మి ఆలయంలో శనన్నవరాత్రోత్సవలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగరంలోని చైతన్యపురి కాలనీ లోని మహాశక్తి ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, ముఖ్య కూడళ్లు విద్యుత్ కాంతులతో భక్తులను మై మరపిస్తున్నాయి. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు, విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో అక్టోబర్ 3 నుండి ప్రారంభమై 12 తేదీ వరకు కొనసాగనున్నాయి.
శ్రీ మహాశక్తి దేవాలయం భక్తులకు కనువిందు చేసేలా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయిస్తున్నారు.
కోరిన కోరికలు తీర్చే శ్రీ మహాశక్తి అమ్మవార్లు..
మహాశక్తి ఆలయంలో కొలువు దీరిన అమ్మవార్లు కోరిన కోర్కెలు తీర్చుతారని భక్తుల నమ్మకం. శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని నమ్ముతారు. ఈ శరన్నవరాత్రోత్సవాల్లో శ్రీ మహాశక్తి దేవాలయ ప్రాంగణం అమ్మవార్ల నామస్మరణతో మార్మోగుతుంది. ముఖ్యంగా ప్రతి ఏటా అమ్మవారి భక్తులు స్వీకరించే ‘‘భవాని దీక్ష’’ లు ఇప్పటికే ప్రారంభం కాగా.. వేలాది మంది భక్తులు తమ శక్తి కొలది 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 11 లేదా నవరాత్రి దీక్షను కొనసాగిస్తారు. దేవాలయ ప్రారంభం నుండి మొదలుకొని నేటి వరకు ఇక్కడ భవాని దీక్ష చేపట్టే భక్తులు గణనీయంగా పెరిగిపోయారు. స్రీ, పురుష బేధములు లేకుండా అందరూ ఆచరించే విశిష్ట భవానీ దీక్ష కోసం కరీంనగర్ జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుండి శ్రీ మహాశక్తి దేవాలయానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలలో..ఇవీ కార్యక్రమాలు
మహాశక్తి ఆలయంలో వచ్చే నెల 3 నుండి 12 వ తేదీ వరకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరుగనున్నాయి. అమ్మవార్లు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 3న గురువారం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి) అవతారంలో దర్శనమిస్తారు. ఉదయం 8 గం.లకు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి పూజ, స్వస్తి పుణ్యహవాచనం, గణపతి పూజ, మాతృకపూజ, నాంది, ఆంకురారోపణము, అఖండ దీపారాధనము, సర్వతోబధ్రమండలం, చతుషష్టి ఉపచారపూజ, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం.. సాయంత్రం 6 గం.లకు శ్రీ మహాదుర్గా అమ్మవారికి ఫలపంచామృత అభిషేకం, వివిధ రకాల పుష్పములతో అమ్మవారికి పుష్పాభిషేకం చేస్తారు. 4న శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని) అవతారంలో అమ్మవారు దర్శనమిస్తామరు. ఉదయం 8 గం.లకు శ్రీ గాయత్రీ దేవి పూజ, అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ తో అలంకరణ, సాయంత్రం 6 గం.లకు సామూహిక కుంకుమ పూజలు జరుగనున్నాయి. 5న శనివారం శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) అవతారంలో భక్తులను ఆకట్టుకోనున్నారు. ఈ రోజున ఉదయం 8 గం.లకు శ్రీ అన్నపూర్ణాదేవి పూజ, అమ్మవారికి శాకాంబరీ అలంకరణ.. సాయంత్రం 6 గం.లకు 108 రకాల నైవేద్యాల సమర్పణ, కొడకండ్ల రాధాకృష్ణ శర్మచే భగవన్నామ సంకీర్తనం కనువిందు చేయనున్నారు. 6న ఆదివారం శ్రీ లలితా దేవి దేవి (కూష్మాండ ) అవతారంలో దర్శనమివ్వనున్నారు అమ్మవారు. ఈ రోజున ఉదయం 8 గం.లకు శ్రీ లలితా దేవి పూజ, గాజులతో అలంకరణ.. సాయంత్రం 6 గం.లకు లలిత సహస్రనామం, సౌందర్య లహరి, కనకధార స్తోత్ర పారాయణం నిర్వహించనున్నారు. 7న సోమవారం మహాచండీ దేవి (స్కంద మాత) అవతారంలో కనిపిస్తారు. ఈ రోజున ఉదయం 8 గంటలకు శ్రీ మహా చండీ దేవి పూజ, పండ్లతో అలంకరణ.. సాయంత్రం 6 గం.లకు లింగార్చన జరుగనుంది. 8న మంగళవారం శ్రీ మహాలక్ష్మి దేవి (కాత్యాయని) అవతారంలో దర్శనమివ్వగా.. ఉదయం 10 గంటలకు శ్రీ మహాలక్ష్మి దేవి పూజ, అమ్మవారికి నాణాలతో, తామర పూలతో అలంకరణ.. సాయంత్రం 6 గం.లకు విష్ణు సహస్రనామ పారాయణం చేయనున్నారు. 9న బుధవారం మూల నక్షత్రం – శ్రీ సరస్వతి దేవి (కాళరాత్రి) అవతారంలో దర్శనమిస్తారు. ఉ.8 గం.లకు శ్రీ సరస్వతి దేవి పూజ మరియు అమ్మవారికి పూలతో అలంకరణ. సాయంత్రం 6 గం.లకు విద్యార్థులచే సరస్వతీ పూజ, పల్లకి సేవ, రతన్ కుమార్ శిష్య బృందంచే శాస్త్రీయ ఆలయ నృత్యాలతో అలరించనున్నారు. 10వ తేదీ గురువారం దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి (మహాగౌరీ) అవతారంలో పూజలందుకోనున్నారు అమ్మవార్లు. ఉదయం 8 గంటలకు శ్రీ మహా దుర్గ పూజ, అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ… సాయంత్రం 6 గం.లకు అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ పూజలు జరుగుతాయి. 11తేదీ శుక్రవారం మహార్నవమి – శ్రీ మహిషాసురమర్ధిని దేవి (సిద్ధి రాత్రి) అవతారంలో పూజలందుకోనున్నారు. ఉదయం 8 గం.లకు శ్రీ మహిషాసురమర్దిని దేవి పూజ, అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరణ, రుద్ర సహిత చండీ హోమం..సాయంత్రం 7 గంటలకు మహిషాసుర సంహారం జరుగనుంది. 12 వ తేదీ శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి పూజ (విజయదశమి), ఉదయం 8 శ్రీ రాజరాజేశ్వరి పూజ, శమీ పూజ.. ఉదయం 9 గంటల నుండి వాహన పూజలు జరగనున్నాయి. అలాగే ప్రతిరోజు రాత్రి 9 గం.ల నుండి అమ్మవారి సన్నిధిలో దాండియా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో, పూజా కార్యక్రమాల్లో పాల్గొని జగదాంబ మూర్తుల కరుణాకటాక్షాలకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.