కరీంనగర్, జనతా న్యూస్: నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించడమే గాక, అక్రమంగా ఇంట్లోకి చొరబడి పలు ఇల్లు కూల్చడమే గాక, ప్రజలను భయ బ్రాంతులను గురి చేసిన కేసులో ఐదుగురి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కొత్తపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కరీంనగర్ ఆదర్శనగర్ కు చెందిన మొహమ్మద్ లతీఫ్ 2017 వ సంవత్సరంలో రేకుర్తిలోని సర్వే నెంబర్ 194 లో గల 61వ ప్లాట్, 248 చదరపు గజాల ఇంటి స్థలాన్ని, సిద్దిపేట జిల్లా ప్రశాంత్ నగర్ కు చెందిన సయ్యద్ జైనాబీ నుంచి కొనుగోలు చేశారు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందారు. ఇదిలా ఉండగా 2023 మే నెల 13 వ తేదీన అకస్మాత్తుగా ఐదుగురు వ్యక్తులు బారాజు రత్నాకర్ రెడ్డి, చందా శంకర్ రావు, బకిట్ సాయి, శ్రీనివాస్ , పిట్టల మధు, షాహిద్ ఖాన్ అనే వ్యక్తులతో పాటు మరి కొంత మంది దౌర్జన్యంగా లతీఫ్ ఇంటిని జేసీబీ తో కూల్చివేసినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొంతమంది ఇళ్లు కూడా కూల్చి ఈ భూమిపై ఎలాంటి హక్కు లేదని దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కొత్తపల్లి పోలీసులు, విచారణ అనంతరం ఐదుగురి వ్యక్తులను మంగళవారంనాడు అరెస్ట్ చేసి వారిపై, ఐపీసీ 452,448,427,506,467,468, 120-B, r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా గౌరవ మేజిస్ట్రేట్ నిందితుల ఐదుగురికి 14 రోజుల రిమాండ్ విధించగా, వారిని కొత్తపల్లి పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు.