Wednesday, July 2, 2025

కార్పో‘రేటు’ చదువులు!

ట్యూషన్‌ ఫీ పేరుతో ఏటా రూ. 500 కోట్లకు పైగా దోపిడీ ?
చట్టం,జీవోలకు చెల్లు
ముక్కు పిండీ ఫీజుల వసూల్లు
యథేచ్ఛగా ప్రయివేటు పాఠశాలల దందా
ప్రేక్షక పాత్రలో విద్యాశాఖ అధికారులు

కరీంనగర్‌-జనత న్యూస్‌:

విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారింది అదుపు తప్పిన వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అధికారులు, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడంతో అది కాస్త దోపిడికి గురవు తూ కార్పొరేటు మాఫియాగా మారింది. సమస్యలొస్తే సెటిల్​ మెంట్​ల కోసం గ్యాంగ్​ లను, కొన్ని సంఘాలను సైతం పెంచి పోషిస్తున్నాయి. విద్యార్ధుల మానసిక ఎదుగుదల ఆధారంగా వారి వయస్సు కు తగ్గట్టుగా ప్రభుత్వం రూపొందించిన సిలబస్​ ను నిర్వీర్యం చేసి ధనార్జనే ధ్యేయంగా తమ ఇష్టం వచ్చిన సిలబస్​లను రూపొందించి మూడవ తరగతి నుండి చెప్పాలంటే ఒకటవ తరగతి నుండే ఐఐటి ఫౌండేషన్​ అని , ఒలింపియాడ్​ , సిబిఎస్​సి, ఐసిఎస్సి, ఐజిసిఎస్సి అని లెక్కలేని పేర్లతో కరి కులములను ప్రవేశ పెట్టి విద్యార్ధులను , తల్లిదండ్రులను ఆయోమయానికి గురిచేస్తూ లక్షల్లో ట్యూషన్​ ఫీజులు వసూలు చేస్తున్నారు. వందల కోట్లనుండి వేల కోట్ల సంపాదనకు పెరిగిన కార్పొరేటు గా చెప్పుకునే విద్యా సంస్థలు రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో కావల్సినంత పార్టీ ఫండ్ ను సర్దే స్థాయికి చేరుకున్నాయి. అధికారులకు కావల్సిన ముడుపులు ముడుతుండంతో వీరి వైపు కన్నెత్తి చూసేవారు లేకపోయారు. ప్రశ్నించే వారు సైతం కరువవడంతో వీరి ఆగడాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. విద్యార్ధుల ప్రజ్ఞా ఆధారంగా చదువు అందించాల్సిన విద్య సంస్థలు అందరిని ఒకే తాటికి కట్టి బలవంతపు చదువుల పేరిట లక్షల ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. స్థాయికి మించిన సిలబస్​లు, సమయపాలన లేకుండా హాస్టల్లో మగ్గే విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి గురై ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలెన్నో చూశాం.ఇష్టారీతిన లక్షల్లో ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడి, యూనిఫాం ,టై, బెల్ట్ చివరికి ‘షూ’ లని కూడ వదలకుండా వ్యాపారం చేస్తూ మధ్యతరగతి ప్రజలకు చుక్కలను చూపెడుతున్నారు. వీరి నిర్వహించే హాస్టల్​ భవనాలకు, పాఠశాల భవనాలకు పర్మిషన్లు లేకున్న, ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాథుడే ఉండడు. వీటిని పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోక పోక పోవడం తల్లిదండ్రుల పాలిట శాపాలుగా పరిణమిస్తున్నాయి.

‘‘ మీ అబ్బాయి/ అమ్మాయిని ఐఐటీ, అక్స్‌ఫర్డ్‌, ఇతర ఇంటర్నేషనల్‌ స్థాయి వరకు తీసుకెళ్లాలను కుంటున్నారా..? అయితే మా స్కూల్‌లో చేర్పించండి. మూడో తరగతి నుండే ఆ స్టాండెడ్‌ చదువు చెబుతున్నాం. మీ ఇంటి పక్కకున్న పిల్లోడు మా స్కూల్లోనే చదువుతున్నడు. మీరూ జాయిన్‌ చేయించండి. అంతా మేం చూసుకుంటాం’’ ఇలా ప్రయివేటు, కార్పోరేట్‌ యాజమాన్యాలు పేరెంట్స్‌ను ట్రాప్‌లోకి లాగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి తల్లిదండ్రులను సైతం ప్రలోబాలకు గురి చేస్తూ రూ. 40 వేల నుండి రూ. లక్ష వరకు ట్యూషన్‌ ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయి.
ఆయా పాఠశాలల్లో చదివిన వేలాది మంది విద్యార్థుల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన ఒకరో, ఇద్దరో ఉండడం సహజం. వారిని ఉదాహారణగా చూపిస్తూ పేరెంట్స్‌ను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి యాజమాన్యాలు. కలర్‌ఫుల్‌ బ్రోచర్లు, హోర్డింగ్‌లు, ఇతర ప్రకటనలతో మధ్య తరగతి వర్గాలను మ్యాజిక్‌ చేస్తున్నాయి. తమ ఆర్థిక స్థితిని మరిచిన పేరెంట్స్‌ లక్షల్లో అప్పులు చేసి ఇలా ప్రయివేటు, కార్పోరేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. పోనీ వారి పిల్లలెవరన్నా..అలా నేషనల్‌, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ స్థాయికి ఎదిగారా అంటే అదీ లేదు.
ప్రయివేటు, కార్పోరేట్‌ యాజమాన్యాలు చేస్తున్న ప్రచారం, వాస్తవానికి ఆకాశం`భూమికి మధ్య ఉన్న తేడా ఉంటుంది. యాజమాన్యాలపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ లేకవడంతో విద్య లాభసాటి వ్యాపారంగా మారినట్లు స్ఫష్టమౌతుంది. కరీంనగర్‌ జిల్లాలో నైతే పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ప్రతీ యేటా విద్యా సంస్థలు పుట్ట గొడుగుల్లా విస్తరిస్తూనేఉన్నాయి. జిల్లాలో సుమారు 300 ప్రయివేటు పాఠశాలల్లో 95 వేల మంది విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం. ఒక్కో విద్యార్థి వద్ద ట్యూషన్‌ ఫీజు రూపంలో రూ. 35 వేల నుండి రూ. లక్షకు పైగా యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయంటే..పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సగటున రూ. 50 వేల ఫీజు వసూలు చేసినా రూ. 500 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్లు స్పష్టమౌతుంది.

అమలు కాని ప్రభుత్వ సెలబస్‌..

నిష్ణాతులైన విద్యావేత్తలతో రూపొందించిన ప్రభుత్వ సెలబస్‌ను పక్కకు పెట్టి, సొంత సెలబస్‌ను ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలు రూపొందించుంటున్నాయి. దీనివల్ల విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనౌతున్నట్లు స్ఫష్టమౌతోంది. అనేక సందర్భాల్లో పలు ప్రయివేటు పాఠశాలల్లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సందర్భాలున్నాయి. తెలుగు, హింది, సోషల్‌ సబ్జెక్ట్‌ లకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో ప్రాంతీయ భాషపై విద్యార్థులు పట్టు కోల్పోవడమే కాకుండా ప్రపంచ స్థాయి బౌగోళిక పరిస్థితులు తెలియకుండా పోతున్నాయి.

పని చేయని ప్రభుత్వ జీవోలు, సర్క్యూలర్లు..

ప్రయివేటు పాఠశాలలో ఫీజు నిర్ణయాధికారం కమిటీకి ఉంటుంది. స్కూల్‌ ఛైర్మన్‌, ప్రిన్సిపల్‌, సెక్రటరీ, టీచర్‌, పేరెంట్‌..ఇలా ఆరుగురున్న కమిటీని డీఈవో నియమించాల్సి ఉంటుంది. పాఠశాల నిర్వహణ, ఖర్చులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ విద్యార్థి ఫీజును నిర్ణయిస్తుంది. పేరెంట్‌ నుండి వసూలు చేసిన ఫీజులో యాజమాన్యం కేవలం 5 శాతం మాత్రమే లాభం తీసుకోవాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం, రాష్ట్ర ప్రభుత్వ జీవో నెం1, జీవో 91 స్పష్టం చేస్తున్నాయి. కమిటీ నిర్ణయించిన ఫీజులను ఆ పాఠశాల బోర్డుపై ప్రదర్శించాల్సి ఉంది. వెబ్‌సైట్‌ లోనూ అప్‌లోడ్‌ చేయాలి. 2023 ఆగస్టు 31న అప్పటి విద్యాశాఖ సెక్రటరీ వాకటి కరుణ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలకు ఈ సర్క్యులర్‌ జారీ చేశారు. వీటిని ఏ ఒక్క పాఠశాల యాజమాన్యం కూడా పాటించడం లేదు. ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన జిల్లా కలెక్టర్‌, డీఈవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విద్యాహక్కు చట్టం, ప్రభుత్వ జీవోలు అమలు చేయాలని సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇటీవల సీఐటీయూ అనుబంధ సంఘాలు సైతం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. అయినా సంబంధిత అధికారుల నుండి స్పందన లేకుండా పోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని..ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుక రావాలని పలు సంఘాలు, సామాజిక వేత్తలు, పేరెంట్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page