Saturday, July 5, 2025

Telangana Congress: కాంగ్రెస్‌లో అయోమయం

  •  క్యాండిడేట్ల కసరత్తు దగ్గరే ఆగిన పార్టీ
  •  అడ్డుగా మారిన సామాజిక సమీకరణాలు
  •  ఇంకా ఎటూతేల్చలేకపోతున్న అధిష్టానం
  •  ఆ పార్టీ నేతల్లో కనిపించని ఎన్నికల జోష్
  •  పెద్దపల్లి, నిజామాబాద్ స్థానాల్లోనూ అదే పరిస్థితి
  •  ఇప్పటికే ప్రజల్లో దూసుకెళ్తున్న బండి సంజయ్
  •  18న జగిత్యాలలో ప్రధాని మోడీ సభ
  •  కరీంనగర్‌లో కదనభేరి మోగించిన కేసీఆర్
  •  ఒకటి, రెండు రోజుల్లోనే నోటిఫికేషన్

(బి.శ్రీనివాస్/జనతాప్రతినిధి, కరీంనగర్)

మరో ఒకటి, రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లుగా తెలుస్తోంది. ఇంతటి ప్రతిష్టా్త్మక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఓ వైపు.. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయడం లేదు. ఈ వైఖరి కాస్త ఆ పార్టీ నేతలను అసహనానికి గురిచేస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జోష్‌లో ఉన్న పార్టీ సరైన టైమ్‌లో సరైన అభ్యర్థులను ప్రకటించకుంటే నష్టపోయే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికే.. బీఆర్ఎస్, బీజేపీలు కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులను ఫైనల్ చేశాయి. కానీ.. కాంగ్రెస్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికితోడు పదుల సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకోవడం కూడా పార్టీకి తలనొప్పిలా తయారైనట్లు సమాచారం. అలాగే.. అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాలు సైతం అడ్డొస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

For E Paper..

Click Here..

Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)

మూడు నియోజకవర్గాల అభ్యర్థులు వీరే..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలు ఉన్నాయి. ఏ పార్లమెంటు నియోజకవర్గంలో చూసినా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్యే పోటీ కనిపిస్తోంది. అయితే.. కరీంనగర్, పెద్దపల్లి స్థానాలకు ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తరఫున కరీంనగర్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ అయిన బండి సంజయ్ కుమార్‌కే మళ్లీ అవకాశం ఇచ్చారు. అటు.. బీఆర్ఎస్ పార్టీ సైతం గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయిన వినోద్ కుమార్‌ పేరునే ప్రకటించారు. ఇక పెద్దపల్లి స్థానానికి వస్తే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో దిగుతున్నారు. బీజేపీ నుంచి గోసాని శ్రీనివాస్ పేరును ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. దీంతో ఇరుపార్టీల అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. అటు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీకి దిగుతుండగా.. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్‌ పేరును ప్రకటించారు.

ప్రచారంలోకి ప్రధాన పార్టీలు

ఇదిలా ఉండగా.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంటు ఎన్నికల కదనరంగంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పాదయాత్రల పేరిట అన్ని మండలాలను చుట్టేస్తున్నారు. మరోవైపు ఈనెల 18న జగిత్యాల వేదికగా విజయసంకల్ప సభ నిర్వహిస్తున్నారు. మూడు పార్లమెంట్ స్థానాలకు ప్రచార వేదికగా నిర్వహిస్తున్న ఈ సభకు ప్రధాని మోడీ హాజరవుతున్నారు. దీనికితోడు కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కదనభేరి సభ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించారు. ఈ రెండు పార్టీలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారంలోకి వెళ్లబోతున్నారు. అయితే.. కాంగ్రెస్‌లో మాత్రం అదే నిస్తేజం కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుంది..? తాము ప్రచారంలోకి ఎప్పుడు వెళ్తాము..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సామాజిక సమీకరణాలు అడ్డు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మంచి జోష్‌లో ఉంది. కానీ.. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం దగ్గరపడుతున్నా అభ్యర్థుల ప్రకటించకపోవడంతో ఆ పార్టీలో నైరాశ్యం నెలకొంది. అయితే.. ప్రధానంగా మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు అడ్డుగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎంపిక నిజామాబాద్ అభ్యర్థితో ముడిపడినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అటు.. నిజామాబాద్ ఎంపీ స్థానానికి జీవన్ రెడ్డి పేరు ముందు నుంచి వినిపిస్తోంది. అయితే.. అక్కడ ఇక్కడ రెండు సీట్లు రెడ్డిలకు ఇస్తే రాష్ట్రంలో రెడ్డిలకు స్థానాలు పెరుగుతున్నట్లుగా అధిష్టానం ఆలోచిస్తోంది. అధిష్టానం ఒకవేళ నిజామాబాద్ సీటు జీవన్ రెడ్డికి కేటాయిస్తే.. కరీంనగర్ సీటు మాత్రం రాజేందర్ రావుకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు పెద్దపల్లి సీటు విషయంలోనూ అదే కొర్రి నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నేతకాని సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దాంతో బీజేపీ ఆ దిశగా ఆలోచించి.. నేతకాని సామాజిక వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్‌ను అభ్యర్థిని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు పోటీ

కాంగ్రెస్ పార్టీలో మూడు పార్లమెంట్ స్థానాలకు భారీ పోటీ నెలకొంది. కరీంనగర్ ఎంపీ స్థానానికి అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ పోటీ పడుతున్నారు. ప్రవీణ్ రెడ్డి గతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా చేశారు. రాజేందర్ రావు గతంలో చొప్పదండి ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. పెద్దపల్లి స్థానం నుంచి గడ్డం వంశీ, సుగుణకుమారి, వెంకటేశ్ నేత పేర్లు వినిపిస్తున్నాయి. గడ్డం వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీ. వివేక్ ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇస్తే తప్పనిసరిగా గెలిపించుకుంటానంటూ అధిష్టానానికి భరోసా ఇస్తున్నారు. ఇక.. గతంలో పెద్దపల్లి ఎంపీగా చేసిన సుగుణకుమారి పేరు కూడా తెరమీదకు వచ్చింది. సుగుణకుమారి గతంలో రెండుసార్లు సీరియర్ కాంగ్రెస్ నేత అయిన వెంకటస్వామిని ఓడించారు. ఈమెకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సపోర్టు ఇస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేశ్ నేత సైతం మరోసారి టికెట్‌ను ఆశిస్తున్నారు.

జీవన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న నిజామాబాద్ క్యాడర్..?

ఇక నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని అందరూ భావించినా.. ఇప్పుడు బాల్కొండకు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి పేరు సైతం తెరమీదకు వచ్చింది. సునీల్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఉమ్మడి కరీంనగర్ నుంచి జగిత్యాల, మెట్‌పల్లి నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంటులో కలిశాయి. అటు నిజామాబాద్ జిల్లాలో మరో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. జీవన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని జగిత్యాల, మెట్‌పల్లి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతిస్తున్నా.. నిజామాబాద్ జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. వారంతా మూకుమ్మడిగా సునీల్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లుగా సమాచారం. సునీల్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని ధీమాతో చెబుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page