- మాజీ ఎమ్మెల్యే అండదండలతో ఏడుగురికి అక్రమంగా పట్టా
- బెజ్జంకిలో 46.04 ఎకరాల ప్రభుత్వ భూమిని బాధిత లబ్ధిదారులకు అందించాలి
- 961,962 సర్వే నెంబర్ లోని అక్రమాలపై విచారణ జరపాలి
- సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలి
- ప్రజాదర్బార్ లో సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్ ఫిర్యాదు
హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్:
సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం, రెవెన్యూ గ్రామ శివారులోని 961, 974 సర్వే నంబర్లలో ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు పంచిన భూములను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అండదండలతో ఆయన బినామీ చింతకింది శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు పట్టా చేయించుకున్నారని ఆర్టీఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్ హైదరాబాద్ లోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో శుక్రవారం జరిగిన ప్రజాదర్బార్ లో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం బెజ్జంకి రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నంబర్ 961లో 9ఎకరాల 30గుంటలు, సర్వే నంబర్ 974 లో ఎకరం 30గుంటలు ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేసిందని తెలిపారు. సర్వే నంబర్ 962 లో 31 ఎకరాల 17గుంటలు, వడ్లూర్ బేగంపేట్ శివారులోని సర్వే నంబర్ 1015 లో 4.07 ఎకరాలు మొత్తం ‘46 ఎకరాల 04గుంటలు’ ప్రభుత్వ భూమిని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ధరణిలో అతడి బినామీలు పట్టా మార్పు చేయించుకున్నారని ఆరోపించారు. రసమయి బినామీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతకింది శ్రీనివాస్, అతడి ఏడుగురు కుటుంబ సభ్యులకు అక్రమంగా పట్టా మార్పు చేయించినట్టు తెలిపారు. ఆ రికార్డుల నుంచి ఆక్రమణదారుల పేర్లు తొలగించి అర్హులైన లబ్ధిదారుల పేర్లు నమోదు చేయాలని కోరారు.
1999 సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం, రెవెన్యూ శివారులోని 955, 956, 961, 974 సర్వే నంబర్లలో 29.22 ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్ ఎల్ పీఎస్ ద్వారా కొనుగోలు చేసి ప్రొ. ఆర్సీ నంబర్ 848/97/A4 ద్వారా 15 మంది ఎస్సీ లబ్ధిదారులకు మొఖ సర్వే చేయించి రిజిస్టర్ చేయించి ఇచ్చారని వివరించారు. అప్పటి నుంచి లబ్ధిదారులు ఖాస్తులో సాగు చేసుకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆయన చెప్పారు. కానీ అధికారుల తప్పిదంతో సర్వేనంబర్ 955, 956 లో పట్టా ఇవ్వబడిన లబ్ధిదారులకు సర్వే నంబర్ 961,974లో సర్వే నంబర్ 961 పట్టా ఇవ్వబడిన లబ్ధిదారులకు సర్వే నంబర్లు 955, 956 లో మొఖ చూపించారని, మొఖ చూపించిన విధంగా లబ్ధిదారులు ఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సర్వే నంబర్ 962 సుమారు 31.17 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి దోనే మల్లయ్య, దోనే కిష్టయ్య, దోనే లాంపుల లింగయ్య, దోనే రామయ్య, దోనే దేవయ్య, దోనే కిష్టయ్యలకు ఒక్కొక్కరికి 5 ఎకరాలు, మొత్తం 30 ఎకరాలు అసైన్డ్ పట్టా ఇచ్చారని పేర్కొన్నారు.
కానీ బెజ్జంకి తహసీల్దార్ నాగ జ్యోతి (2020 సంవత్సరంలో అవినీతి ఆరోపణలో ఏసీబీ అధికారులు అరెస్ట్ అయ్యారు) తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకొని పేదలకు పంపిణీ చేసిన సర్వే నంబర్ 961లో 9.30 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బినామీ, అత్యంత సన్నిహితుడైన చింతకింది శ్రీనివాస్ అతడి తండ్రి చింతకింది వెంకటేశం, తల్లి చింతకింది విజయ ఇద్దరి పేర్లపైన ఒక్కొక్కరికి 4.30 ఎకరాలు పట్టా చేయించుకున్నారన్నారు. అలాగే సర్వే నంబర్ 962లో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూమిని చింతకింది శ్రీనివాస్ పేరు మీద 5 ఎకరాలు, అతడి తల్లి చింతకింది విజయ పేరు మీద 5 ఎకరాలు, సోదరుడు చింతకింది ప్రవీణ్ కుమార్ 5 ఎకరాలు, వివాహమైన ఇద్దరు చెల్లెల్లు చెన్న లత 5 ఎకరాలు, గంగిశెట్టి అరుణ 5 ఎకరాల పట్టా చేయించారని పేర్కొన్నారు.
అలాగే వడ్లూర్ బేగంపేట రెవెన్యూ గ్రామ శివారులో.. 50 సంవత్సరాల కింద హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిన కటకం వీరేశం అనే వ్యక్తికి చెందిన 2 ఎకరాల 7గుంటలను చింతకింది వెంకటేశం పట్టా చేయించుకున్నట్లు తెలిపారు. మొత్తం ఏడు గురు ఒకే కుటుంబానికి చెందిన చింతకింది శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు 46.04 ఎకరాలు (అసైన్డ్) దోచిపెట్టారని బాధితులు ఆరోపించారు. ఎల్ పీఎస్ ప్రభుత్వ భూమిని ఆర్డీవో, తహసీల్దార్ లు అసైన్డ్ భూమి రికార్డులను పరిశీలించకుండానే మాజీ ఎమ్మెల్యే రసమయి ఒత్తిళ్లకు తలొగ్గి ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా ధరణిలో ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్పు చేశారని ఆరోపించారు. ఈ భూముల పేరు మీద చింతకింది శ్రీనివాస్ తదితరులు వివిధ బ్యాంకుల్లో తప్పుడు పత్రాలతో ఎల్టీ లోన్స్, క్రాప్ లోన్స్, సబ్సిడీ రుణాలు తీసుకున్నారని వివరించారు. గతంలో ఈ భూమిని కౌలుకు ఇచ్చినట్టు బినామీ పేర్లతో రికార్డులు తయారు చేసి వారి పేర్లతో లోన్స్ తీసుకోని ఆయనే వాడుకున్నాడని ఆరోపించారు.
ఈ విషయాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వీటిపై సీఎం రేవంత్ రెడ్డి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులను ఆదుకోవాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆ భూమి బాధితులు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ‘ప్రజాదర్భార్’లో ఫిర్యాదులో కోరారు.