ముంబైలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఇక్కడ వీచిన గాలుల కారణంగా నగరంలోని ఘట్ కోపర్ లో ఫ్యూయల్ స్టేషన్ వద్ద భారీ బిల్ బోర్డు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కొన్ని కార్లు కూడా స్వల్పంగా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. బిల్ బోర్డ్ కింద మరికొంతమంది చిక్కుకున్నారని అధికారులు పేర్కొన్నారు.
ముంబైలో సోమవారం మధ్యాహ్నం నుంచి గాలి దుమారానికి వాతావరణంలో ఒక్కసారిగా ఆకస్మిక మార్పులు వచ్చాయి. దీంతో బలమైన గాలులు వీచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నగరంలోని ఘట్ కోవర్, బాంద్రా కుర్లా, ధారవి ఏరియాలో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడింది. గాలి దుమారం, వర్షం కారణంగా నగరంలో కొన్ని వస్తుువులు ఎక్కడకక్కడ చెల్లాచెరుగా పడ్డాయి. అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో టేక్ ఆఫ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో చెట్లు నేలకు ఒరిగిపోయాయి.