అందుకే బంగ్లాదేశ్ ఘటనపై నోరు విప్పడం లేదు
నెహ్రూ అరాచకాలవల్లే విభజన గాయాలు
అంబేద్కర్ ఆలోచనలను రూపుమాపే కుట్ర
‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కరీంనగర్-జనత న్యూస్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంఛలన వ్యాఖ్యలు చేశారు. ఛైనా ఆలోచనలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమలు చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. కరీంనగర్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ఘటనపై చైనా ఆదేశాలతోనే రాహుల్ గాంధీ నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు. నెహ్రూ కుటుంబానికి రాజకీయ లబ్ది చేకూర్చడం కోసం, దేశ మహనీయుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనను కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్య్ర ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతోపాటు మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశం కోసం అనేక మంది బలిదానాలు చేశారని, కాంగ్రెస్ నేతలు మాత్రం నెహ్రు కుటుంబానికి లబ్ధి చేయడమే లక్ష్యంగా చరిత్రను కనుమరుగు చేసే యత్నం చేసిందని ఆరోపించారు. నెహ్రూ అరాచక, అనాలోచిత విధానాలవల్ల విభజన గాయాలు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ మాత్రం అంకుల్ శ్యాం పిట్రోడా వాడుతున్న అమెరికా భాషను ఉపయోగిస్తున్నడని.. చైనా ఆలోచనను అమలు చేసే వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆరోపించారు. బంగ్లాదేశ్ పై రాహుల్ గాంధీ నోరెందుకు విప్పరని ప్రశ్నించారు మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే… దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకునేందుకు తిరంగా యాత్ర చేపడుతున్నామన్నారు.
యువమోర్చ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర
భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రను ప్రారంభమై..టవర్ సర్కిల్ వరకు కొనసాగింది. భారీ ఎత్తున తరలివచ్చిన యువకులు, విద్యార్థులు మువ్వెన్నెల జెండాను చేత పట్టుకుని మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ కదం తొక్కారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వారితో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు. తెలంగాణ ప్రజలంతా తక్షణమే ఫోన్ వాట్సప్ డీపీలను మార్చాలని పిలుపునిచ్చారు. దేశభక్తుల ఫొటోలు, మువ్వెన్నెల జెండాను డీపీలుగా పెట్టుకోవాలని.. ప్రతి భారతీయుడు తమ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేసి హర్ ఘర్ తిరంగా డాట్ కమ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పిలుపునిచ్చారు.