Wednesday, July 2, 2025

టీచర్స్‌ ఎమ్మెల్సీకి భారీగా ఆశావాహులు !

బీజేపీలో పెరిగిన ఆశావాహులు
కేంద్ర మంత్రుల వద్దకు క్యూ..
కాంగ్రెస్‌ నుండి హర్షవర్థన్‌ రెడ్డి ప్రయత్నాలు
పీఆర్‌టీయూ మాండేట్‌ కోసం పలువురు
జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి
కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. బీజేపీ మద్దతు కోసం ఇప్పటి నుండే పలువురు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ లను కలుస్తూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మండలిలో ప్రస్తుతం హైదరాబాద్‌ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా, రానున్న కరీంనగర్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి బలాన్ని పెంచుకోవాలని బీజేపీ వ్యుహాన్ని రచిస్తోంది. మరోవైపు సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించుకోవాలని పీఆర్‌టీయూ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ సంఘంలో పోటీ చేసేందుకు ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ నుండి ఎస్టీయు వ్యవస్థాపకులు హర్షవర్థన్‌ రెడ్డి, సీఎం రేవంత్‌ రెడ్డి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా..కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఈ సారి రసవత్తరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరీంనగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే మార్చిలో జరుగనున్నాయి. కరీంనగర్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో 13 కొత్త జిల్లాలు మరో రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ నియోజక వర్గ పరిధిలోకి వస్తాయి. 2019 ఎన్నికల్లో 23 వేల పైచిలుకు ఓటర్లు నమోదు కాగా..ఈ సారి 30 వేల వరకు పెరిగే ఛాన్స్‌ ఉంది. పట్టభద్రుల తరహాలోనే టీచర్స్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేయించేందుకు ఆశావాహలు సిద్దపడ్డారు. ఈ నెల 30 నుండి మొదలు కానున్న ఓటరు నమోదు ప్రక్రియను ముమ్మరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పీఆర్‌టీయూ నుండి మరోసారి పోటీ
2019లో పీఆర్‌టీయూ నుండి పోటీ చేసిన విజయం సాధించిన సిద్దిపేట జిల్లాకు చెందిన కూర రఘోత్తమ్‌ రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు. అయితే ఈ సంఘం నుండి పలువురు ఆశావాహులు ఉండగా..వారు మాండేట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సిద్దిపేట జిల్లా మందంపల్లికి చెందిన మాజీ అసోసియేట్‌ రాష్ట్ర అధ్యక్షులు వంగ మహేందర్‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా జిల్లాలో ఆయన ఇప్పటికే ముమ్మరంగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. నిజమాబాద్‌ జిల్లాకు చెందిన బీరెల్లి కరుణాకర్‌ రెడ్డి ఈ సంఘంలో వివిధ రాష్ట్ర పదవుల ద్వారా సేవలందించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన జాలి మహేందర్‌ రెడ్డి సంఘంలో సుదీర్ఘ కాలంగా పని చేశారు. వీరిలో ఎవరికి టికెట్‌ ఇస్తారనేదానిపై సస్పెన్స్‌ నెలకొంది.
మద్దతు కోసం కేంద్ర మంత్రుల వద్ద క్యూ..
కరీంనగర్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కోసం పలువురు ఆశావాహులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎస్టీయూ నుండి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన మామిడి సుధాకర్‌ రెడ్డి, కరీంనగర్‌ మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంత రెడ్డి, పోలు సత్యనారాయణ, నరహరి లక్ష్మారెడ్డి, వీరితో పాటు మరో ఇద్దరు బీజేపీ మద్దతు కోసం పోటీ పడుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ వద్ద క్యూ కడుతున్నారు. బీజేపీ మద్దతు కోసం తమవంతుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. మద్దతు విషయమై ఇప్పటి వరకు ఎవరికీ బీజేపీ అధిష్టానం హామీ ఇవ్వలేదు.
కరీంనగర్‌లో పాగా కోసం..
ఎమ్మెల్సీ పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లాలో బీజేపీ పార్లమెంటు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరీంనగర్‌ నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్‌, మెదక్‌ నుండి రఘునందన్‌ రావు, నిజామాబాద్‌లో రఘునందన్‌ రావు, ఆదిలాబాద్‌ నుండి గోడం నగేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నుండి బీజేపీ టీచర్స్‌ ఎమ్మెల్సీగా ఏవీఎన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌లో పాగా వేసి బలం పెంచుకోవాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గెలపు బాధ్యత కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీసుకునే అవకాశాలున్నాయి.
గెలపుపై కాంగ్రెస్‌ సమాలోచనలు..
కరీంనగర్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో సొంతంగా అభ్యర్థిని నిలిపితే గెలుపు సాధ్యసధ్యాలపై ఆ పార్టీ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ మద్దతుతో అభ్యర్థిని బరిలో నిలపడమా, లేక ఏదైన ఉపాధ్యాయ సంఘ ప్రతినిధికి మద్దతు ఇవ్వడమా అనే దానిపై ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీపీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌ రెడ్డిని బరిలో నిపిపితే గెలుపుపై అంచనాలు వేస్తుంది ఆ పార్టీ. అయితే..తటస్థంగా ఉండే టీచర్ల మద్దతు కూడ గట్టాలంటే..వారి సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పలువురు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page