70 శాతం రైతులకు రూ. లక్ష మాఫీ కాలేదు..
నిరూపిస్తాం..మంత్రి పదవి రాజీనామాకు సిద్దమా ?
రాష్ట్ర మంత్రి పొన్నంకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి సవాల్
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ జిల్లాలో 70 శాతం రైతులకు రూ. లక్ష రుణమాఫీ జరగలేదని, దీన్ని నిరూపించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. కరీంనగర్ ఎంపీ ఆఫీసులో బీజేపీ నాయకులతో కలసి మీడియాతో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోస పేరుతో చేసిన మోసాలు నిరూపిస్తామని..ఇందుకు రాజీనామాకు సిద్దమా అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గంగాడి సవాల్ విసిరారు. తాము నిరూపించకుంటే రాజకీయాల నుండి వైదొలుగుతామన్నారు. దమ్ముంటే పంట రుణాలు, రుణమాఫీపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని ఆయన సవాల్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని ఏ మండలమైనా, ఏ రెవెన్యూ డివిజైనా సెలెక్ట్ చేసుకుని..పరిశీలనకు వెళ్దామని సూచించారు. రైతులకు 70 శాతం రూ. లక్ష రుణమాఫీ జరుగలేదని తాము నిరూపిస్తామని, లేని పక్షంలో ముక్కు నేలకు రాసి క్షమాపన చెపుతామన్నారు. నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. దీనిపై డేట్, టైం, వేదిక ఫిక్స్ చేయాలని సవాల్ చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.