మరో పథకం..
మహిళా సంఘ సభ్యులకు చీరలు 804.64 కోట్ల వస్త్రోత్పత్తికి సీఎం ఆదేశాలు
ఇక సిరిసిల్ల కార్మికులకు..చేతినిండా పని !
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
సిరిసిల్ల పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి తెర పడనుంది. కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికగా పవర్ లూమ్ కార్మికులకు గుడ్ న్యూస్ ప్రకటించారు. రాష్ట్రంలోని 63.86 లక్షల మంది స్వయం సహాయక మహిళా సభ్యులకు యేడాదికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు సీఎం. అయితే.. నాణ్యతతో చీరలు తయారు చేయాలని, ఇందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు . సీఎం ఆదేశాలతో ప్రధానంగా సిరిసిల్ల చేనేత కార్మికులకు చేతినిండా పని దొరకనుంది.
రాష్ట్ర ప్రభుత్వం కోటీ 27 లక్షల చీరల ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేయడంతో..సిరిసిల్ల నేతన్నలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి లభించనుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ బతుకమ్మ చీరల ఉత్పత్తిని నిలిపి వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..అదే స్థానంలో మహిళా సంఘాలకు నాణ్యతతో చీరల ఉత్పత్తి చేసి పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 804.64 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తికి నేతన్న లకు ఆర్డర్స్ రానుంది. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 138 మ్యాక్స్ సొసైటీలు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లలో పని చేస్తున్న సుమారు 15 వేల మందికి పైగా కార్మికులకు చేతి నిండా పని లభించనుంది. బతుకమ్మ చీరల్లో నాణ్యత లోపించిందనే అరోపనల నేపథ్యంలో, ఇక ఉత్పత్తి చేసే చీరలు నాణ్యతతో ఉండాలనే సీఎం ఆదేశాల నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపు, ముడి సరుకు వినియోగంపై అధికారులు ప్రణాళిక రూపొందించనున్నారు.
గతంలో ఏటా ఐదు నెలలే పని..
గత ఏడు సంవత్సరాలుగా బతుకమ్మ చీరల ఉత్పత్తితో ఏటా 4 నెలల వరకు సిరసిల్ల కార్మికులకు ఉపాధి లభించేది. మరో రెండు నెలలు ఆర్వీఎం, ఇతర వస్త్రోత్పత్తితో కాలం వెల్లదీసే వారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పొడవునా కార్మికులకు ఉపాధి లభించేలా ప్రయత్నాలు చేస్తుంది.
ప్రభుత్వ సంస్థలకు సరఫరా అయ్యే వస్త్రాలను చేనేత, పవర్ లూమ్ కార్మికుల నుండి ఉత్పత్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని ప్రస్తుత సర్కారు యోచిస్తోంది. ఇందుకు ఆర్టీసీ, సింగరేణి సంస్థలు, సంక్షేమ శాఖలతో పాటు ప్రయివేటు, కార్పోరేట్ సంస్థలతో చర్చించి..సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికులకు ఆర్డర్స్ ఇచ్చేలా కృషి కొనసాగుతోంది.
బహుముఖ వ్యూహంతో సర్కారు..
వస్త్రోత్పత్తిలో కాంగ్రెస్ ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తుంది. క్వాలిటీ ఉత్పత్తులతో పాటు మార్కెటింగ్, కార్మిక కుటుంబాల సంక్షేమం పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐఐహెచ్‌టీ కాలేజీని ప్రారంభించింది. ఈ సామాజిక వర్గం నుండి వచ్చిన వారికి ఇందులో ప్రవేశాలు కల్పించింది సర్కారు. గత ప్రభుత్వంలో ఉన్న పెండిరగ్ బకాయిలనూ దశల వారీగా విడుదల చేస్తోంది. సిరిసిల్ల బతుకమ్మ చీరల బకాయిలు సుమారు రూ. 300 కోట్లలో రూ. 100 కోట్లను విడుదల చేసింది సర్కారు. ఇలా నిరంతరం పని, గిట్టుబాలు కూలీ, భద్రత, సంక్షేమాలు అందించేలా ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ శాఖకు బడ్జెట్‌లో రూ.1300 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా..ఇందులో 25శాతం మేర కూడా ఖర్చు చేయలేదు. దీంతో సంక్షేమం అటకెక్కింది. ప్ర్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తుంది. అయితే..ఈ ప్రయత్నాలు ఎంత వరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి.