- 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 13 వేల ఉద్యోగాలనే భర్తీ చేస్తారా?
- మోదీ ప్రభుత్వం ఏడాదిలోనే 8 లక్షలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేసింది
- కట్టె కాలేవరకు కేసీఆర్ తెలంగాణను దోచుకుంటూనే ఉంటడు
- టిక్కెట్ కోసం కన్న కొడుకు పేరునే మార్చిన మోసగాడు కేసీఆర్
- కల్వకుంట్ల అజయ్ రావు టిక్కెట్ ఇచ్చాక కేటీఆర్ అయ్యిండు
- కేసీఆర్, కేటీఆర్ లకు తెల్లారిలేస్తే నన్ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు
- కేంద్రం నయాపైసా ఇయ్యలేదని పచ్చి అబద్దాలు చెబుతున్నారు
- కేంద్రం ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చిందో వివరాలిచ్చేందుకు మేం సిద్ధం
- 10 ఏళ్లలో కేసీఆర్ గ్రామాలకు ఏం చేసిండో చెప్పాలి
- అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వాడుతున్న భాష జుగుప్సాకరం
- ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ బీజేపీ మాత్రమే
- ముస్తాబాద్ లో బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
- పుల్వామా అమర వీరులకు క్యాండిల్ నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు
సిరిసిల్ల, జనతా న్యూస్: రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు వంద రోజుల్లో భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకునే పరిస్థితి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రేపు 13 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు అపాయిట్ మెంట్ లెటర్లు ఇవ్వబోతున్నారని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి నియామక పత్రాలు కాబోతున్నాయని అన్నారు. కట్టె కాలేవరకు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. కేసీఆర్ అంతటి మోసగాడు ఎవరూ లేరని, కట్టె కాలేవరకు తెలంగాణను దోచుకుంటూనే ఉంటారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ తోపాటు బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ ను అరెస్ట్ చేయడంతోపాటు ఆ కుటుంబ ఆస్తులన్ని అమ్మి ప్రజలకు పంచే వాళ్లమని చెప్పారు.
ప్రజాహిత యాత్రలో భాగంగా సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. భారీ ఎత్తున ప్రజలు తరలిచ్చి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. సంజయ్ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్ర చేశారు. అనంతరం వారిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు..
సిరిసిల్ల జిల్లాకు రూ.1408 కోట్ల 60 లక్షల రూపాయలను కేంద్రం ఖర్చు చేసింది. ఇవి 7 పథకాలకు సంబంధించి మాత్రమే… దీంతోపాటు సిరిసిల్ల అసెంబ్లీ, ముస్తాబాద్ మండలానికి సంబంధించి ఏయే పనులకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందనే వివరాలను వెల్లడించారు. ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పే దమ్ముందా అని పశ్నించారు. తాను చెప్పిన వివరాలు తప్పయితే తనపైన కేసు పెట్టుకోవచ్చన్నారు. అయినా సిగ్గు లేకుండా కేంద్రం తెలంగాణకు నయాపైసా ఇయ్యలేదని బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలాడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే…. కేసీఆర్ తోపాటు బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేసి ఆ కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రజలను దోచుకుంటూ పేదల పొట్టకొట్టిన కేసీఆర్ ఆస్తులను జప్తు చేసే వాళ్లమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు, చేతలకు పొంతనే లేదన్నారు. ‘‘వంద రోజుల్లో ఒక్క మహిళ అకౌంట్లో రూ.2 వేల 500లు వేస్తామన్నారు. రూ. 2లక్షల రుణమాఫీ, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఛార్జీలు ఫ్రీ అన్నారు. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామన్నారు… కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు.. వారం పదిరోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. కోడ్ ను సాకు చూపి కాంగ్రెస్ హామీలను అమలు చేయకుండా చేతులెత్తబోతోంది.’’ అని పేర్కొన్నారు. ‘‘రేవంత్ రెడ్డి 13 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామకాలకు సంబంధించి రేపు అపాయిట్ మెంట్ లెటర్లు ఇవ్వబోతున్నారు. ఇవే ఆయనకు చివరి నియామక పత్రాలు కాబోతున్నయ్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల్లేవ్’’అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 8 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారని, మళ్లీ ఆయనను ప్రధానిగా చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు.