-కాకతీయవిశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నుండి పీహెచ్డీ పొందిన ఈదులకంటి అనిత
ఇల్లంతకుంట, జనతా న్యూస్: తెలంగాణ సాయుధ పోరాటంలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ప్రముఖమైన పాత్ర పోషించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, తదితర అంశాలపై కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈదులకంటి అనిత చరిత్ర విభాగం నుంచి పరిశోధనలు చేశారు. ఇందుకు గాను ఆమె పీహెచ్ డీ పొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పెల్లి గ్రామానికి చెందిన బద్దం ఎల్లారెడ్డి 1906లో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యార్థి దశ నుంచే విప్లవ భావాలకి ఆకర్షితులయ్యారు. ఏదో చేయాలని తపన ఉండడంతో నాటి స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా కాకినాడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడు నెలల జైలు శిక్షణ కూడా అనుభవించారు. ఆంధ్ర మహాసభలలో ప్రముఖ నాయకునిగా రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తర్వాత కమ్యూనిస్టు,సోషలిస్ట్ భావాల ప్రభావంతో నిజాం రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
పార్టీలో అగ్రనాయకుడిగా ఉన్న రావి నారాయణరెడ్డి, ముగ్ధం మొహినోద్దీన్ తో బద్దం ఎల్లారెడ్డి పని చేశారు. ప్రజా సమస్యల మీద నిజాంకు,భూస్వాముల అధికారానికి,నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాట దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత తెలంగాణ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటానికి 11 సెప్టెంబర్ 1947 లో పిలుపునిచ్చారు. బద్దం ఎల్లారెడ్డి దళం సభ్యులు అనబేరి ప్రభాకర్ రావు,సింగిరెడ్డి భూపతిరెడ్డి మరియు 10 మంది దళ సభ్యులు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి కరీంనగర్ జిల్లా మహమ్మదాపూర్ గుట్టలలో నిజాం సైన్యానికి వీరి దళానికి మధ్య జరిగిన ఎదురు కాల్పులలో కొంతమంది అమరులైనారు. తన దళాన్ని కొంత కోల్పోయినప్పటికీ వెనక్కి తిరగకుండా పోరాటం కొనసాగించాడు. నాటి పోలీసులు అతనికి మూడు సంవత్సరాల కఠినమైన కారాగార శిక్షను అనుభవించారు. జైలులో ఉండగానే 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1958లో బుగ్గారం నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునిగా, 1965 లో రాజ్యసభ సభ్యునిగా, 1972లో ఇందుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనారు. 1978 లో శాసనసభ కమిటీ సభ్యునిగా విశాఖపట్నం గిరిజనుల సమస్యల ను తెలుసుకోవడానికి వెళ్లి అక్కడే అనారోగ్యానికి గురై రెండు నెలల తర్వాత గాలిపల్లిలో 27 డిసెంబర్ 1978లో మరణించారు.
చాలా సామాన్యమైన జీవితం గడుపుతూ నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తన భూమిని పేదలకు ఉచితంగా పంచిన ఎల్లారెడ్డి సిరిసిల్లలోని మగ్గం కార్మికులకు అందించిన సేవలకు గుర్తుగా సిరిసిల్లలో బద్దం ఎల్లారెడ్డి నగర్ అని ఒక కాలనీకి ఆయన పేరు పెట్టారు. అది ప్రస్తుతం బి వై నగర్ గా పిలుస్తున్నారు. కరీంనగర్ లోని కమ్యూనిస్టు పార్టీ భవన్ పేరును బద్దం ఎల్లారెడ్డి భవన్ గా మార్చారు. 2006లో కరీంనగర్ లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. 2015లో బద్దం ఎల్లారెడ్డి గారి కుమారుడు రామ్ రెడ్డి గారు గాలి పల్లిలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు.

బద్ధం ఎల్లారెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలని, ఆ గొప్ప వ్యక్తి మీద కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామానికి చెందిన ఈదులకంటి అనిత కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నుంచి ప్రొఫెసర్ పి సదానందం గారి గైడెన్స్ లో ‘ద రోల్ ఆఫ్ బద్దం ఎల్లారెడ్డి ఇన్ లెఫ్ట్ మూమెంట్ ఇన్ తెలంగాణ ఏ -స్టడీ’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి డాక్టరేటు పొందారు.మారుమూల గ్రామానికి చెందిన అగ్ర నాయకుడు బద్దం ఎల్లారెడ్డి పై పరిశోధన పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని డాక్టర్ అనిత ఆనందం వ్యక్తం చేశారు.