Saturday, July 5, 2025

అయోధ్య అంతా రామమయం

  • భక్తుల కీర్తనలతో మార్మోగుతున్న సరయూ
  • దేశ,విదేశాల నుంచి తరలివస్తున్న భక్తులు
  • అయోధ్యకు అతిరథ,మహారథులు
ఎన్నో వివాదాలు..మరెన్నో చిక్కుముళ్లు..ఇంకెన్నో అడ్డంగులు.. అయితేనేం అయోధ్య రాముల వారు ఒక్కో మెట్టును అధిగమించేశారు. హిందూ సంఘాలు,ధార్మిక సంస్థలు,హైందవ సోదరులు చేసిన కృషి ఫలితంగా తన గుడిని ఎట్టకేలకు నిర్మించుకున్నారు. ప్రపంచాన్నే ఔరా అనిపించేలా అందరిని మంత్రముగ్థులను చేసేలా ఇవాళ తన ప్రాణప్రతిష్టా మహోత్సవం చేసుకోబోతున్నారు. వెరసి అయోధ్య రాముడి,కోసల రాముడి,దశరథ సుపుత్రుడి మందిర ప్రారంభోత్సవంతో దేశమంతా భక్తితో పరవశిస్తోంది

ఇవాళ అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు అయోధ్యలోని గ్రాండ్ టెంపుల్‌లో శ్రీరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యూపీ సర్కార్ ట్రస్ట్ నిర్వాహకులకు అవసరమైన సహాయ,సహకారాలను అందజేస్తోంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట క్రతువు నేపథ్యంలోనే రామ్ జన్్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు,హిందూ ధార్మిక సంఘాలు ఫైజాబాద్ జిల్లా,అయోధ్య వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోదండ రాముడి విశేషాలను తెలియజేసేలా ఫెక్సీలను ఏర్పాటు చేయించారు. ఆయా ఫెక్సీలపై రాముడి యొక్క గుణ,గణాలు,కోసల రాజ్య పరిపాలనకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు.

మరోవైపు ప్రాణ ప్రతిష్ట మహోత్సవం దృష్ట్యా 2 వేల క్వింటాళ్ల పూలను తెప్పించారు. బంతి, ఇతరత్రా పూలతో అయోధ్య నగరం మొత్తాన్ని ఒక సుందర దృశ్యంగా ముస్తాబు చేయించారు. అయోధ్య పూల ఆలంకరణలతో ముస్తాబు కావడంతో..నగరం మొత్తం సువాసన పరిమళాలు వెదజల్లుతున్నాయి. దీంతో ఆ కోదండ రాముడి కోసల రాజ్యం మొత్తం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత కొత్త శోభను సంతరించుకుంది. ఇక ఇవాళ ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం బాలరాముడు (రామ్ లల్లా) విగ్రహానికి ఉత్సవ స్నానం చేయించారు. సుమారు 60 దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రానికే రామయ్య ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించేందుకు అయోధ్యకు చేరుకున్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా మరో 10 వేల మందికి పైగా ప్రముఖులు అయోధ్యకు ఇప్పటికే వచ్చేశారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page