పీఎంపీ, ఆర్‌ఎంపీలపై..
చర్యలకు వెనకడుగు ?
ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిళ్లు
ట్రీట్‌మెంట్ విధి విధానాలపై స్ఫష్టత కరువు
యథావిధిగా క్లీనిక్‌లలో కొనసాగుతున్న చికిత్స
కరీంనగర్-జనత న్యూస్
గ్రామాలు, పట్టణాల్లోని పీఎంపీ, ఆర్‌ఎంపీ క్లీనిక్ లపై ఐఎంఏ కమిటీ దాడులు విరమించుకుందా..? ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? పీఎంపీలకు ప్రభుత్వం నుండి అభయ హస్తం ఇచ్చిందా..? గతంలోలానే యథేచ్చగా వైద్య సేవలు నిర్వహించుకోవచ్చా ? అంటే ప్రస్తుతం ఔననే చెప్పాలి. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న క్లీనిక్ లపై గతంలో నిర్వహించిన దాడులు ఎక్కడి కక్కడ నిలిచి పోవడమే ఇందుకు నిదర్శనం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో పీఎంపీ, ఆర్‌ఎంపీ క్లీనిక్ లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఐఎంఏ కమిటీ..గత కొద్ది రోజుల నుండి నిలిపి వేసింది.
పక్షం రోజుల క్రితం వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పీఎంపీ, ఆర్‌పీఎం క్లీనిక్‌లపై ఐఎంఏ కమిటీలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు కూడా నమోదు చేశాయి. ఐఎంఏ, డీఎంహెచ్‌వో, పోలీసు శాఖల నుండి ఒక్కొక్కరు చొప్పున, ముగ్గురు సభ్యులు గల కమిటీ ఆయా జిల్లాలో ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని సుమారు 50 పీఎంపీ, ఆర్‌ఎంపీ క్లీనిక్ లలో తనిఖీలు నిర్వహించిన బృందం..ఏడు కేసులు నమోదు చేయించింది. పెద్దపల్లి జిల్లాలో ఏడు క్లీనిక్ లలో తనికీలు చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసింది. ఇలా సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలోనూ ఐఎంఏ కమిటీలు క్లీనిక్‌లపై తనిఖీలు నిర్వహించాయి.
బెంబెలెత్తిన పీఎంపీలు..
పీఎంపీ, ఆర్‌ఎంపీ క్లీనిక్ లపై దాడులు కొనసాగడంతో వారు బెంబేలెత్తి పోయారు. తనిఖీలు నిలిపి వేయాలని ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అసోసియేషన్ ప్రతినిధులు..ఆయా స్థాయిలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఒత్తిళ్లు పెంచడంతో ప్రభుత్వం దిగొచ్చి తనిఖీలు నిలిపి వేయించినట్లు సమాచారం. దీంతో ప్రయివేటు మెడికల్ ప్రాక్టీషనర్లు ఊపిరి పీల్చుకున్నారు.
రిజిస్ట్రేషన్ లేని క్లీనిక్‌లు..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 వేలకు పైగానే పీఎంపీ, ఆర్‌ఎంపీలున్నారు. ఇందులో 80 శాతం మందికి పైగా ఎంబీబీఎస్ అంతకు మిం చి స్పెషలిటీ డాక్టర్స్ వద్ద చేసిన అనుభవం లేదు. దీంతో వారు నకిలీ లేనని తేల్చుతుంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ . క్లీనిక్‌లో బెడ్స్ వేయ డం, యాంటిబయోటిక్, స్టెరాయిడ్, పెయిన్ కిల్లిర్ ఇంజ క్లైన్ వేయడం, సెలైన్ పెట్టడం, లాబ్స్ నిర్వహించడం, గర్భ విచ్ఛిత్తి, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారాదని నిబంధనలు చెబుతున్నాయి. కాని వాస్తవంగా ఇందుకు విరుద్దంగా గ్రామ, పట్టణాల్లో క్లీనిక్‌లు కొనసాగుతున్నాయి.
శిక్షణతో సర్టిఫికెట్ ఇస్తే..
2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఎంపీ, పీఎంపీ లకు శిక్షణ సర్టిఫికెట్ కోర్పును ప్రవేశ పెట్టింది. మూడు నెలల చొప్పున శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేసి..వైద్య సేవలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది. ఇలా అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 వేల మందికి..బ్యాచ్‌కి వంద మంది చొప్పున శిక్షణ ఏర్పాటు చేశారు. నిష్ణాతులైన వైద్య నిపుణులచే వీడియేలు తయారు చేయించి..ఎల్‌సీడీ మానిటరింగ్ ద్వారా క్లాస్‌లు చెప్పించారు. అయితే..ఆ శిక్షణ మధ్యలోనే నిలిచి పోయింది. ఈ శిక్షణనూ అప్పటి ఐఎంఏ కమిటీ వ్యతిరేకించింది. గత ప్రతిపాదనను తాజాగా ప్రభుత్వం ముందు పెట్టారు పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు. శిక్షణతో సర్టిఫికెట్ ఇచ్చి క్లీనిక్‌లకు అనుమతించాలని కోరుతున్నారు.
పీఎంపీ, ఆర్‌ఎంపీలపై విమర్శలు..
గ్రామ, పట్టణాల్లోని రోగులను ప్రయివేటు ఆసుపత్రులకు పంపిస్తే 25 శాతం నుండి 40 శాతం వరకు పీఎంపీ, ఆర్‌ఎంపీలు కమీషన్ తీసుకుంటారనే ఆరోపనలున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆ మేరకు రోగుల వద్ద నుండి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు కూడా రెఫర్ చేస్తున్నారట. వీటి నియంత్రణ చర్యలేవీ లేక పోవడంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నట్లు సామాజిక వేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ సర్కారుకు సవాల్..
పీఎంపీ, ఆర్‌ఎంపీ క్లీనిక్‌లను మూసివేస్తే..ప్రత్యామ్నాయ సేవలందించే యంత్రాంగం ప్రభుత్వం వద్ద లేదు. వారికి పూర్తి స్వేచ్ఛనిస్తే..రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్య సేవల విస్తరణ..పీఎంపీ క్లీనిక్‌ల నియంత్రణకు సమాంతర చర్యలు తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది.