జగిత్యాల, జనతా న్యూస్: జగిత్యాల జిల్లా మేడిపల్లి గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గత నెల 30వ తేదీన అవసర నిమిత్తం కరీంనగర్ కి వచ్చారు. తన పని ముగించుకుని తిరుగు ప్రయాణంకై కరీంనగర్ లోని కోతిరాంపూర్ నుంచి బస్ స్టాండ్ వెళ్లేందుకు ఆటోలో వెళ్లగా, ఆటో లో డ్రైవర్ తో పాటు ఉన్న మరో ఇద్దరు కలిసి తనని సిరిసిల్ల బైపాస్ వైపుగా తీసుకెళ్లి అతన్ని కొట్టి , మొబైల్ ఫోన్ తో పాటు బాగ్ ను ఎత్తుకెళ్లారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపెల్లి గ్రామానికి చెందిన, ప్రస్తుతం భగత్ నగర్ లో నివాసం ఉంటున్న నూనావత్ తిరుపతి, బానోత్ రాజు లు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్లుగా వుంటూ , ఇరువురు ఒకే ఆటోలో వుండి ప్రయాణికుడైన షేక్ షబ్బీర్ ను సిరిసిల్ల బై పాస్ వైపు తీసుకెళ్లి అతన్ని, కొట్టి బెదిరించి అతని వద్ద గల పదమూడు వేల రూపాయల విలువ గల సెల్ ఫోన్ తో పాటు అతని వద్ద గల బ్యాగ్ అందులో గల బ్యాంకు పాస్ బుక్ , ఏటీఎం కార్డు , ఇతర కార్డుల దోపిడికి పాల్పడ్డట్లు పోలీసులు తేల్చారు. అంతేకాకుండా బాధితుడి మొబైల్ ఫోన్ లోని సిమ్ కార్డును నిందితుల మొబైల్ ఫోన్ లోకి మార్చి బ్యాంకు అకౌంట్ ద్వారా 99,000 రూపాయలను సైతం అపహరించారని తేలింది. నిందుతులిద్దరిని టవర్ సర్కిల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా గుర్తించి పట్టుకుని 392 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్ట్ లో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించారని కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. దొంగతనానికి పాల్పడిన నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని ఏసీపీ నరేందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సరిలాల్ , ఎస్సై స్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
దోపిడీకి పాల్పడిన ఇద్దరు నేరస్థుల అరెస్టు
- Advertisment -