అందుబాటులో ఉచిత వైద్య సేవలు..
ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా..
వారంలో రెండు రోజుల పాటు టెస్టులు
కరీంనగర్ జిల్లాలో 9 ఆరోగ్య కేంద్రాల్లో..
40 వేల మంది మహిళల రిజిస్ట్రేషన్
క్యాన్సర్, ఇతర వ్యాధుల గుర్తింపు
కలెక్టర్, డీఎంహెచ్‌వో విస్తృత ప్రచారం
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
మాతా, శిశు ఆసుపత్రుల్లో ప్రసవాలు, ఆరోగ్య మహిళ కేంద్రాల్లో వైద్య పరీక్షలు, చికిత్స లకు ముందుకొస్తున్నారు మహిళలు. దీంతో ప్రయివేటు నర్సింగ్ హోమ్, ఆసుపత్రులు వెలవెల పోతున్నాయి. ప్రధానంగా మహిళా ఆరోగ్య కేంద్రాల్లో క్యాన్సర్‌తో పాటు ఇతర ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి రావడంతో పాటు విస్తృత ప్రచారం చేయడం వల్ల ఎక్కువ మంది మహిళలు వీటిని వినియోగించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 40 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉచిత వైద్య పరీక్షలు, చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య మహిళా కేంద్రాల వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను ఆదిలోనే గుర్తించి చికిత్స పొందడం వల్ల జీవిత కాలాన్ని పొడగించుకుంటున్నారు. ఆయా వ్యాధి లక్షణాలున్న మహిళలకు మెరుగైన నాణ్యమైన చికిత్స కోసం హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు ఇక్కడి వైద్యాధికారులు.
ఆరోగ్య మహిళ కేంద్రాలు ఆందుబాటులోకి వచ్చాక పేద, మధ్య తరగతి మహిళలు వైద్య పరీక్షలు, చికిత్స తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. సంవత్సరంన్నర క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 272 క్లీనిక్‌లు ఏర్పాటయ్యాయి. ఇందులో కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 9 ఆరోగ్య మహిళా కేంద్రాల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 40, 074 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకుని వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. ఇందులో ఇప్పటి వరకు పది మంది మహిళలకు క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు..చికిత్స కోసం హైదరాబాద్ ఎంఎన్‌జే ఆసుపత్రికి రెఫర్ చేశారు.
జిల్లాలో ఇవీ ఆరోగ్య మహిళా కేంద్రాలు..
కరీంనగర్ జిల్లాలో 9 మహిళా ఆరోగ్య కేంద్రాలున్నాయి. నగరంలోని రేకుర్తి, తీగలగుట్టపల్లి, బుట్టి రాజారాం కాలనీ అర్భన్ హెల్త్ సెంటర్లు.. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి పీహెచ్‌సీ, రామడుగు మండలం గుండి, చొప్పదండి, వీణవంక మండలం చల్లూరు, ఇల్లందకుంట, సైదాపూర్ లలో మహిళా ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ మంగళ, గురు వారాల్లో మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ టెస్టులూ చేస్తారు. వారి రిపోర్టు ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో స్క్రీనింగ్ చేసుకున్న మహిళల్లోని అనుమానితులను కరీంనగర్ రేడియాలోజీ విభాగానికి పంపిస్తారు. ఇక్కడ ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు చేసి సమస్యను గుర్తిస్తారు. వీటితో పాటు ప్రత్యేక 10 రకాల బ్లడ్ టెస్టులూ టీ హబ్‌లో చేసి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు.
నిర్వహించే వైద్య పరీక్షలివే..
ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు ఉచిత నిర్ధారణ పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు, కుటుంబ నియంత్రణ, ఋతుస్రావ సమస్యలు నిర్వహణ, మెనోపాజ్ నిర్వహణ, లైంగిక వ్యాధులు, మూత్రనాళ వ్యవస్థ వ్యాధులపై తొలుత స్క్రీనింగ్ చేస్తారు. లక్షణాలున్న వారికి ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇందులో క్లినికల్ రొమ్ము పరీక్ష, విజువల్ ఎసిటిక్ ఆసిడ్ ద్వారా పరీక్ష, నోటి కుహర పరీక్ష, సూక్ష్మ పోషకాల లోప పరీక్ష, స్ట్రిప్ విదానం ద్వారా (యూటిఐ) పరీక్ష, మెనోపాజ్ పరీక్ష (గర్భాషయ), అనుమానిత (పీసీవోడి) , మూత్రనాళ వ్యాధి (ఎస్‌టీఐ) గుర్తింపు, బరువు నిర్వహణ పరీక్షలు నిర్వహించి ఇందులో సమస్యల గుర్తించి చికిత్స అందిస్తున్నారు.
పెరుగుతున్న క్యాన్సర్ అనుమానితులు..
కరీంనగర్ జిల్లాలో క్యాన్సర్ అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా వైద్య పరీక్షలు చేసుకున్న వారిలో నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ అనుమానితులు ఉన్నట్లు గుర్తించారు. 40 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 450 మంది వరకు క్యాన్సర్ అనుమానితులున్నట్లు వైద్యులు గుర్తించారు. అనిమియా విభాగంలో 7 నుండి 9.9 శాతం హెచ్‌బీ ఉన్న మహిళలు 3, 846 మంది, 10 నుండి 10.9 శాతం ఉన్న వారు 14, 254 మంది ఉన్నారు. గర్భాశయ సంక్రమిత వ్యాధులతో వేల మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఆయా సెంటర్లలో చికిత్స అందించడం వల్ల సమస్యను తగ్గించుకో గలిగారు. లైంగిక సంక్రమిత వ్యాధులు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతుంది.
ఆరోగ్య మహిళ పరీక్షలపై విస్తృత ప్రచారం..
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, డిఎంహెచ్‌వో డాక్టర్ సుజాత, ఇతర వైద్యాధికారులు ఆరోగ్య మహిళా కేంద్రాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం సభలోనూ జిల్లా కలెక్టర్ మహిళలకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. ప్రతీ మహిళా ఆ రోగ్య మహిళా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తో పాటు ప్రతీ మూడు మాసాలకోసారి వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే..ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి అనే అపోహతో లక్షణాలున్నప్పటికీ చికిత్స చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారెందరో ఉన్నారు. అపోహలు వీడి వైద్య పరీక్షలకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక దశలో వ్యాధిని నిర్ధారించి చికిత్స తీసుకోవడం వల్ల జీవిత కాలాన్ని పొగడిరచుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు.