పెద్దపల్లి, జనతా న్యూస్: జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలను పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ ఆదివారం అందజేశారు. మంథనిలోని నృసింహ శివ కిరణ్ గార్డెన్స్ లో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ (టి.ఎస్.- ఎస్.టి.ఇ.పి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో గల ఉన్న ఉపాధి అవకాశాలు తెలియజేస్తూ అర్హులైన వారికి వెంటనే ఉద్యోగం కల్పించే దిశగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళాను జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి,జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు.ఐటి, ఫార్మా, నిర్మాణరంగం, మార్కెటింగ్ మొదలగు వివిధ రంగాలకు చెందిన 65 కంపెనీలు మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయని, కంపెనీలలో గల ఉద్యోగ అవకాశాల ప్రకారం 7వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు.మెగా జాబ్ మేళా వినియోగించుకుంటూ యువత ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను సాధించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.అదనపు కలెక్టర్ మెగా జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన కంపెనీల స్టాళ్లను పరిశీలించి ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతకు ముందు మంథనిలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ప్రారంభించారు.యువత తమకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించాలని, ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిపై దృష్టి సారించాలని సీపి అన్నారు.
మొత్తంగా 65 పైగా ప్రైవేటు కంపెనీలు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో మొత్తం 1377 మంది అభ్యర్థులు టిఎస్ఎస్ టిఇపి పోర్టల్ లోతమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా, 330 మంది అభ్యర్థులు ఎంపిక అయినట్లు,629 మంది అభ్యర్థులు షార్ట్ లిస్టులో ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.వై.ఎస్.ఓ- ఎ.సురేష్ ,జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు, మంథని ఎంపీపీ కొండ శంకర్, రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య,ధ్రువ్ కన్సల్టింగ్ సర్వీసెస్ చైర్మన్ మన్మోహన్,సిబ్బంది, సంబంధిత అధికారులు,నాయకులు, పలు కంపెనీల హెచ్ఆర్ లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.