ఇల్లంతకుంట, జనతా న్యూస్: ‘నీకు సాయం చేస్తే నాకేంటి?’ అన్న రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు దూరం కావడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం సాటి మనిషిని పట్టించుకోలేనంత బిజీగా మారుతున్నారు. ఈ తరుణంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు నేనున్నాను అంటూ ఆపద్భాంధవుడిలా నిలుస్తున్నాడు. తనకు తోచిన సాయం చేస్తూ అభాగ్యులకు అండగా ఉంటున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదరిస్తున్నాడు. ఆ ఉపాధ్యయుడి గురించి వివరాల్లకి వెళితే..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయ్యన్న గారి హరికృష్ణ రెడ్డి గురించి మండల వ్యాప్తంగా తీవ్ర చర్చించుకుంటున్నారు. తాను ప్రభుత్వ విధుల్లో ఎంత బిజీ ఉన్నా తోటి వారికి సాయం చేయడానికి సమయం కేటాయిస్తున్నారు. ఆపదలో ఉన్నారని తెలిస్తే వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన వంతుగా అభాగ్యులకు నగదు, నిత్యావసర సరుకులు అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నాడు. ఇల్లంతకుండ మండలంలో దురదృష్టవశాత్తూ ఎవరైనా తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మిగిలితే వారికి అన్నీ తానై చూసుకుంటున్నారు. ఇటీవల గాలిపెల్లి గ్రామంలో చంద్రమౌళి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అందరిచేత మన్ననలు అందుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా హరికృష్ణ రెడ్డి చెప్పారు.