Ap Politics : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటికే అధికార వైసీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఐదేళ్లలో చేసిన పనులను చెబుతోంది. మరోసారి అధికారం కోసం అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత కోరుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేనలు తమ రాజకీయ కార్యకలాపాలు స్పీడును పెంచాయి. తాజాగా మరోసారి ఇరు పార్టీ అధినేతలు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందని తేలినా..సీట్ల పంపకం విషయంలో కాస్త అయోమయం నెలకొంది. అంతే కాకుండా ఇటీవల రెండు పార్టీలు వేర్వేరుగా అభ్యర్థులను ప్రకటించడంపై పార్టీల నాయకుల్లో నిరాశ ఏర్పడింది. ఈ తరుణంలో మరోసారి ఆదివారం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో ఎవరెవరికి ఏ స్థానంలో సీట్లు ఇవ్వాలనే విషయం తేలినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉమ్మడిగా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటిస్తారని ఆశిస్తున్నారు.