హైదరాబాద్ లో తగ్గనున్న పోలింగ్ శాతం?
హైదరాబాద్, జనత న్యూస్: ఆంధ్రప్రదేశ్లో శాసనసభతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులు ఓటు కోసం సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈనెల 13న తెలంగాణతో పాటు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న ఆంధ్ర వాసులు సొంత రాష్ట్రంలో ఓటు వేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడికే ఎక్కువగా వలస వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోరు రోజురోజుకు ఉత్కంఠ గా మారుతోంది. ఇక్కడ ప్రతి ఓటు కీలకంగా ఉండనుందన్న చర్చ సాగుతోంది. దీంతో ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి వెళ్లే బస్సులు రద్దీగా మారాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వెహికల్స్ ఏపీ వైపు వెళ్లడంతో టోల్ గేట్ల వద్ద రద్దీగా మారుతుంది. తెలంగాణలో ఉన్న ఏపీ రాష్ట్రవాసులు ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు వెళ్లినట్లు సమాాచారం. దీంతో గ్రేటర్ పరిధిలో నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఏపీ ఓటర్లు ఉన్నారు. అలాగే నిజామాబాద్, మెదక్ స్థానాల్లోనూ కొంతమంది ఏపీ వాసులు ఉన్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనేందుకు ఏపీకి వెళ్లడంతో తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓటు వేయలేకపోతున్నారు.