మహాదుర్గాదేవికి శాఖంబరి అలంకరణ
ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు
భవానీ భక్తుల నినాదాలతో మారుమోగిన మహాశక్తి ఆలయం
కరీంనగర్-జనత న్యూస్
నగరంలోని చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు శనివారం అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న డ్రై ఫ్రూట్స్ తో ముగ్గురు అమ్మలను అందంగా ముస్తాబు చేయగా, నేడు కూరగాయలతో శ్రీ మహాదుర్గ అమ్మవారికి శాఖంబరి రూపంలో అలంకరణ చేశారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు రాష్ట్రం నలువైపుల నుండి తరలి వచ్చారు. వేలాది మంది భవానీ భక్తుల నినాదాలతో మహాశక్తి ఆలయమంతా మారుమోగుతోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవానీ భక్తులతో కలిసి ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఆలయంలోనే ఉంటూ ప్రజల విజ్జాపనలు స్వీకరిస్తూ… మరోవైపు భవానీ భక్తులతో కలిసి అమ్మవారిని సేవించారు. ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక రీతిలో 10 రకాల హారతులు ఇస్తున్నారు. అర్దరాత్రి మహాశక్తి అమ్మవార్లకు చేసే అభిషేకాలు హైలైట్స్ గా నిలుస్తున్నాయి. రాత్రిపూట అమ్మవారి ఆలయంతోపాటు చుట్టు పరిసరాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో వెలుగు జిలుగులతో ఆకర్షనీయంగా మారాయి.