సదుపాయాల కల్పనకు సర్కారు ఓకే
అదే స్ఫూర్తితో బద్దిపల్లిలో మరో టౌన్ షిప్
ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వ అడుగులు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
అంగారిక టౌన్ షిప్ సభ్యుల రెండేండ్ల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు మౌళిక సదుపాయాల కల్పనకు సానుకూలంగా స్పందించింది సర్కారు. దీంతో రూ. 20 కోట్ల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన అంగారిక టౌన్ షిప్ స్ఫూర్తితో నగర శివారులోని బద్దిపల్లిలో మరో టౌన్ షిప్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మోసాలకు గురి కాకుండా ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, మధ్య తరగతి వ్యాపార వర్గాలకు ప్లాట్లు విక్రయిస్తూ, ఆదాయాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టౌన్ షిప్స్ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ శివారులో 2022 అక్టోబర్‌లో అంగారిక టౌన్ షిప్ పేరుతో ప్లాట్లను విక్రయించింది అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం. 784 ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 180 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక్కడి వరకు భాగానే ఉన్నా..ముందుగా చెప్పినట్లుగా టౌన్‌షిప్‌లో మౌళిక సదుపాయాలేవీ కల్పించక పోవడంతో సభ్యులు సుమారు రెండేండ్లుగా జిల్లా కలెక్టర్, అప్పటి ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి వేసారారు. అయినా..ఫలితం లేకుండా పోయింది. టౌన్‌షిప్ సభ్యులు ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. నుస్తులాపూర్ అంగారిక టౌన్ షిప్ అభివృద్ధికి రూపొందించిన రూ. 20 కోట్ల ప్రతిపాదనలకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో అర్చీ, డ్రైనేజీ, విద్యుత్ సబ్‌స్టేషన్, తాగునీటి వసతి..తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
గత ఖర్చులపై అనేక అనుమానాలు..
తిమ్మాపూర్ మండలంలోని అంగారిక టౌన్ షిప్ వేలంకు ముందు లేవలింగ్ పనులకు రూ. ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపినట్లు తెలిసింది. కరీంనగర్‌కు చెందిన ఆ ఒక కాంట్రాక్టరుకే ఈ పనులు అప్పగించారు. రెండేండ్ల క్రితం కేవలం మట్టి లేవలింగ్‌కు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంపై అనేక అనుమానాలు రేకెత్తు తున్నాయి. దీంతో పాటు పాట్ల కేటాయింపుకు నిర్వహించిన వేలం పాటలకు రూ. 28 లక్షలు ఖర్చుల పేరుతో బిల్లులు పొందినట్లు సమాచారం. వీటిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బద్దిపల్లిలో మరో టౌన్‌షిప్ ?
కరీంనగర్ శివారులోని బద్దిపల్లి లోనూ మరో టౌన్ షిప్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తిమ్మాపూర్ మండలంలోని టౌన్‌షిప్‌లో మౌళిక సదుపాయాలు కల్పించాక మధ్య తరగతి వర్గాల్లో ప్రభుత్వం పట్ల భరోస వస్తుంది. నగరాన్ని క్రమపద్దతిలో విస్తరించడం, సౌకర్యాల కల్పనతో పాటు ప్రభుత్వానికీ ఆధాయం సమకూరే అవకాశాలుంటాయి. ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న ప్రభుత్వానికి టౌన్‌షిప్‌ల ఏర్పాటు మంచి ఫలితాలను ఇస్తాయని పలువురు భావిస్తున్నారు. అయితే..అదే స్థాయిలో నిరుపేదలకు నివేశన స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే డిమాండ్లూ పెరుగుతాయి.
అంగారిక టౌన్‌షిప్‌కు మహర్థశ ?

- Advertisment -